రేర్ క్లిక్: అన్నయ్య ఖైదీ అయితే తమ్ముడు పోలీస్

అనుకోకుండానే సెట్లో అన్నయ్య ఖైదీ గా కనిపిస్తే .. తమ్ముడు పోలీస్ గా కనిపించారు. ఇది రేర్ క్లిక్. ఈ దృశ్యానికి వేదిక హైదరాబాద్ ఔటర్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీ. వివరాల్లోకి వెళితే…

మెగాస్టార్ చిరంజీవి మలయాళ బ్లాక్ బస్టర్ `లూసీఫర్` రీమేక్ `గాడ్ ఫాదర్` లో నటిస్తున్న సంగతి తెలిసింది. చిరు టైటిల్ పాత్రను పోషిస్తున్నారు. `తని ఒరువన్` ఫేం మోహన్ రాజా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తోన్న`భీమ్లా నాయక్` కూడా మలయాళ సినిమా `అయ్యప్పునం కోషియమ్` కి రీమేక్ ఇది. ఇలా అన్నదమ్ములిద్దరు ఒకేసారి మలయాళ రీమేక్ లలో నటించడం విశేషం. మరో ఆసక్తికర సంగతేమంటే.. భీమ్లా నాయక్ ఇప్పుడు అల్యూమినియం ఫ్యాక్టరీలోనే షూటింగ్ చేస్తున్నారు.

ఇలా బ్రదర్స్ ఇద్దరూ పక్క పక్కనే షూటింగ్ లు చేస్తున్నారు. ఇక మెగాస్టార్ నేరుగా తన తమ్ముడు పవన్ కల్యాణ్ సినిమా సెట్ ని సందర్శించారు. అనుకోకుండానే మెగాస్టార్ భీమ్లా నాయక్ సెట్స్ కు వచ్చారన్న సంగతి తెలుసుకున్న యూనిట్ సభ్యులు.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్వయంగా చిరంజీవిని సాదరంగా ఆహ్వానించారు. మెగాస్టార్ తన తమ్ముడి పక్కనే కూర్చుని చాలా సేపు ముచ్చట్లాడారని తెలిసింది.

అయితే అన్నయ్య మాట్లాడుతుండగా… పవన్ మాత్రం ఏదీ మాట్లాడలేదు. అన్నయ్య చెప్పింది శ్రద్దగా విన్నారంతే. మరి ఆ సమయంలో చిరంజీవి సినిమా విషయాలనే పంచుకున్నారా? లేక వ్యక్తిగత విషయాలు..కుటుంబ విషయాలు షేర్ చేసుకున్నారా? లేక ఇంకేదైనా రాజకీయాల పైనా మాట్లాడారా? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ . వారిద్దరు ఆన్ సెట్స్ లో అనుకోకుండా కలుసుకున్నారు కాబట్టి సినిమా విషయాలే చర్చకు వచ్చి ఉంటాయని అభిమానులు భావిస్తున్నారు.

ఇక అన్నయ్య ఏం మాట్లాడిన శ్రద్దగా వినడం తప్ప తమ్ముడు మాట్లాడేది ఏనాడూ లేదు. ఎలాంటి వేదిక అయినా అన్నయ్య వద్ద పవన్ అలాగే నడుచుకుంటారు. అది కేవలం అన్నపై ఉన్న అభిమానం.. గౌరవం..భక్తి..శ్రద్ధ..భయం తప్ప ఇంకేదీ కాదు.

గాడ్ ఫాదర్ లో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కూడా నటిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఆ విషయం కూడా బ్రదర్స్ ముచ్చట్లలో వెల్లడై ఉండొచ్చు. ప్రస్తుతం గాడ్ ఫాదర్ షూటింగ్ లో భాగంగా జైలు ఎపిసోడ్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ నేథ్యంలో చిరంజీవి ఖైదీ డ్రెస్ లో ఉన్నారు. అలాగే భీమ్లా నాయక్ లో పవన్ పోలీస్ అధికారి పాత్ర కాబట్టి ఆయన పోలీస్ యూనిఫాం లో ఉన్నట్లు తెలుస్తోంది.

మరోవైపు మెగాస్టార్ బ్యాక్ టు బ్యాక్ నాలుగు సినిమాలకు కమిటవ్వగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా వెంట వెంటనే మూడు సినిమాలకు కమిట్ మెంట్లు ఇచ్చి దర్శకుల్ని ఫైనల్ చేశారు. ఇవన్నీ వరుసగా సెట్స్ పైకి వెళతాయి. ఇక 60 ప్లస్ ఏజ్ లో చిరు.. 50 ఏజ్ లో పవన్ ఎంతో హుషారుగా షూటింగులు చేయడం నిజంగా వారికి సినిమా అంటే ఉన్న ఫ్యాషన్ కి నిదర్శనం అంటూ అభిమానుల్లో ముచ్చట సాగుతోంది.