లేపి తన్నించుకోవడమంటే ఇదే మరి.! ‘వకీల్ సాబ్’ సినిమా విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి కుట్రలు చేసిందో అందరికీ తెలిసిందే. టిక్కెట్ రేట్లను ‘వకీల్ సాబ్’ సినిమా కోసం గణనీయంగా తగ్గించింది వైఎస్ జగన్ ప్రభుత్వం. అప్పట్లో ఈ విషయమై పెద్దయెత్తున విమర్శలొస్తే, సామాన్యుడికి సినిమాని దూరం చేస్తారా.? టిక్కెట్ల రేట్లు పెంచి, ప్రేక్షకుల్ని దోచుకుంటారా.? అని వైసీపీ నేతలు ప్రశ్నించారు.
కరోనా నేపథ్యంలో ఆ తర్వాత సినిమాలేవీ విడుదల కాలేదు. మళ్ళీ ఇప్పుడు సినిమాల విడుదలకు రంగం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమలో టిక్కెట్ల రేట్ల అంశం అలజడి రేపుతోంది. ఓ ఎగ్జిబిటర్ పేరుతో ఓ బులుగు మీడియా కథనం తెరపైకొచ్చింది. పవన్ కళ్యాణ్ నిద్రపోతున్నారా.? అని ప్రశ్నించేశాడా పేరు చెప్పుకోవడానికి భయపడే ఎగ్జిబిటర్. పవన్ కళ్యాణ్ ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడట. 50 కోట్ల పైన రెమ్యునరేషన్ పుచ్చుకునే స్టార్ హీరో పవన్ కళ్యాణ్ అట.
పవన్ కళ్యాణ్ స్టార్ హీరో అన్నది నిజం. జనసేన పార్టీ అధినేత అన్నదీ నిజమే. కానీ, ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఇక్కడ. ఆ తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా తెలుగు సినీ పరిశ్రమలో ఓ అగ్రహీరో. పరిశ్రమకి పెద్ద దిక్కు అంటే తమ కుటుంబమే.. అంటారాయన. కానీ, బాలకృష్ణని నిద్ర లేపాలంటే, బులుగు మీడియాకి భయం. ఎక్కడ చాచి చెంప ఛెళ్ళు మనిపించేస్తాడోనని.
నిజానికి, పవన్ కళ్యాణ్.. ఈ టిక్కెట్ల గొడవలో బాధితుడు. పవన్ సినిమాని వైసీపీ దెబ్బకొట్టింది. పవన్ తరఫున మొత్తం సినీ పరిశ్రమ మాట్లాడాల్సి వుంది. కానీ, మాట్లాడలేదు. అప్పట్లో ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించిన బులుగు మీడియానే, ఇప్పుడు మొత్తం సినీ పరిశ్రమ తరఫున వకాల్తా పుచ్చుకుని, పవన్ కళ్యాణ్‌ని ప్రశ్నిస్తోంది. సిగ్గు.. శరం.. అనేవి ఏమన్నా వుంటే, ప్రశ్నించాల్సింది ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని మాత్రమే.
అంత సీన్ ఎటూ బులుగు మీడియాకి వుండదు. ఇక్కడ ఓ విషయం ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. ఏ సమస్య అయినా, పవన్ కళ్యాణ్ నిలబడితే.. ఆ సమస్యకు పరిష్కారం లభిస్తుందని బులుగు మీడియా కూడా భావిస్తుండడం.