పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోవడమంటే, రాజకీయాల్లో అది పెద్ద నేరమా.? అక్కడికేదో పవన్ కళ్యాణ్ చేయకూడని తప్పు చేసేసినట్లు, ‘రెండు చోట్లా ఓడిపోయాడు..’ అని వెటకారం చేయడమేంటి.?
రాజకీయాల్లో గెలుపోటములు సహజం. గొప్ప గొప్ప పదవులు వెలగబెట్టినవాళ్ళే ఓడిపోయారు రాజకీయాల్లో. ముఖ్యమంత్రులు ఓడిపోయారు.. కేంద్ర మంత్రులుగా పనిచేసినవాళ్ళూ ఓడిపోయారు.. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. అయితే, పవన్ కళ్యాణ్ ఓటమి చాలా చాలా ప్రత్యేకం. గెలవడం కోసం అడ్డదారులు తొక్కి వుంటే, పవన్ కళ్యాణ్ ఓడిపోయే పరిస్థితే వుండేది కాదు. జనసేన పార్టీని ఎలాగైనా గెలిపించుకోవాలని పవన్ కళ్యాణ్ అనుకుని వుంటే.. ఆ లెక్కలు ఇంకోలా వుండేవి.
2014 ఎన్నికల్లో నరేంద్ర మోడీ వేవ్ వున్న సమయంలో, జనసేన పార్టీ తరఫున ఓ పదో పాతికో సీట్లు ఏపీ నుంచీ, ఓ అరడజను సీట్లు తెలంగాణ నుంచీ జనసేన పార్టీ ఆశించి వుంటే.. ఖచ్చితంగా జనసేనకు అప్పుడే చట్ట సభల్లో ప్రాతినిథ్యం లభించి వుండేది. అప్పట్లో జనసేనాని పవన్ కళ్యాణ్, చట్ట సభల్లో ప్రాతినిథ్యం గురించి ఆలోచించలేదు. ప్రజల్లో చైతన్యం తీసుకొద్దామనుకున్నారు. మార్పు దిశగా తెలుగు నాట రాజకీయాల్లో సరికొత్త సంచలనం కోసం ప్రయత్నించారు.
రాజకీయాల్లో డబ్బు రాజ్యమేలుతోన్న రోజులివి. కులం, మతం, ప్రాంతం.. వాట్ నాట్.. అన్నిటినీ రాజకీయ పార్టీలు వాడేస్తున్న రోజులివి. ‘వ్యూహకర్తలకు’ కోట్లు చెల్లించి మరీ, గెలవడానికి వ్యూహాల్ని పార్టీలు రచిస్తున్నాయంటే, ఇప్పుడు రాజకీయం ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు. కరెన్సీ నోటు పంచని రాజకీయం కోరుకున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అదే ఆయన చేసిన అతి పెద్ద తప్పు. అయినాసరే, ఆ తప్పు చేసినందుకు గర్వపడుతున్నారే తప్ప, సిగ్గుపడే పరిస్థితి జనసేన అధినేతకి ఎప్పుడూ రాదు. ప్రయత్నిస్తాం, ప్రయత్నిస్తూనే వుంటామన్నది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాదన.
డబ్బుతో రాజకీయం చేయదలచుకుంటే, అది పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తికి పెద్ద కష్టమేమీ కాదు. ‘మార్పు కోసం’ అనే ఆలోచనని పవన్ కళ్యాణ్ పక్కన పెట్టేస్తే, 2024 ఎన్నికల్లో రాజకీయం ఇంకో లెవల్లో వుంటుందన్నది నిర్వివాదాంశం. విద్యా వ్యవస్థలో సంస్కరణలకు సంబంధించి జనసేన ఆలోచనల్ని కేంద్రం పరిగణనలోకి తీసుకుందంటేనే, జనసేన ఎంతటి గొప్ప ఆలోచనలతో పుట్టిందో అర్థం చేసుకోవచ్చు.
మార్పు ప్రజలు కోరుకోవడంలేదా.? ప్రజలు కోరుకుంటోన్న మార్పుకు అనుగుణంగా జనసేన మారలేకోకపోతోందా.? కారణం ఏదైనా, జనసేన పార్టీ.. తన సత్తా చాటాల్సిన సమయమిది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తన సిద్ధాంతాలకు లోబడే పదునైన రాజకీయ వ్యూహాల్న రచించి, ప్రత్యర్థుల నోళ్ళకు తాళాలు వెయ్యాల్సిందే.. అదీ తనదైన విజయాలతో.