ఔను, పవన్ హెచ్చిరికలే నిజమవుతున్నాయ్.!

వైసీపీ అధికారంలోకి వస్తే ఏమవుతుందో 2019 ఎన్నికల సమయంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనానికి అర్థమయ్యేలా చెప్పారు. అయితే, ‘ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్..’ అంటూ వైసీపీ, ఓటర్లను బతిమాలుకున్న వైనం.. దానికి తోడు, టీడీపీ – వైసీపీ కలిసికట్టుగా జనసేన మీద చేసిన దుష్ప్రచారం వెరసి.. వైసీపీ ఆంధ్రప్రదేశ్‌లో అధికార పీఠమెక్కింది.

అప్పట్లో పవన్ కళ్యాణ్ ఏం చెప్పారో.. అవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి. రాష్ట్రం అప్పుల కుప్పలా మారిపోయింది. సంక్షేమ పథకాల పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు నడుస్తున్నాయి తప్ప, రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం. అంతేనా, రాజధాని అమరావతి ఆగిపోయింది. బోనస్‌గా నీఛ నికృష్ట రాజకీయాలు రాష్ట్రంలో రాజ్యమేలుతున్నాయి.

రాజకీయ పార్టీలపై దాడులు, రాజకీయ నాయకులపై దాడులు.. ప్రజలపై దాడులు.. ఒకటా.? రెండా.? చెప్పుకుంటూ పోతే లిస్టు చాలా పెద్దదే. దేశంలోనే గంజాయి స్మగ్లింగ్‌కి కేరాఫ్ అడ్రస్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. గతంలో ఎన్నడూ చూడని, ఎన్నడూ వినని వైపరీత్యమిది.

తమకు ఎలాంటి పరిపాలన కావాలో ఎంచుకోవాల్సింది ప్రజలే. ఎన్నికల సమయంలో ఓట్లను కొనేందుకు రాజకీయ పార్టీలు వేసే ఎత్తులు జిత్తులు అన్నీ ఇన్నీ కావు. వాటి పట్ల అప్రమత్తంగా వుండకపోతే.. కరెన్సీ నోటుకి ఓటర్లు లొంగిపోతే.. ఇదిగో ఇలాంటి పరిస్థితులే వుంటాయి.

ప్రతిపక్షంలో వున్నప్పుడు పెట్రో ధరలపై మొసలి కన్నీరు కార్చి, అధికార పీఠమెక్కాక.. పెట్రో ధరలు పెరుగుతున్నా, రాష్ట్రం తరఫున ప్రజల మీద భారాన్ని తగ్గించేందుకు ప్రయత్నం చేయకపోవడాన్ని ఏమనాలి.? ‘మన రాష్ట్రానికి రాజధాని ఏది.?’ అని జనం ప్రశ్నించకపోతే, ఇంకో పాతికేళ్ళయినా.. రాష్ట్రానికి రాజధాని వుంటుందా.?

రాష్ట్రంలో అభివృద్ధి ఎందుకు జరగడంలేదు.? అంటే, పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు గుర్తుకొస్తాయ్ అధికార పక్షానికి. రాష్ట్రం నుంచి గంజాయ్ ఎందుకు పెద్దయెత్తున స్మగ్లింగ్ అవుతోందంటే, దానికీ పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళనే సమాధానంగా చెప్పేలా వున్నారు అధికార పార్టీ నేతలు.

వైఫల్యం, చేతకానితనం.. ఇవన్నీ చిన్న మాటలుగా చెప్పుకోవాల్సి వుంటుంది రాష్ట్రంలో వైసీపీ పాలన గురించి. మందిని వెంటేసుకుని, రాజకీయ ప్రత్యర్థుల మీదకు విరుచుకుపడ్డం తప్ప, ప్రజలు తమకు అధికారం ఇచ్చింది మెరుగైన పాలన కోసమన్న కనీస ఇంగితం లేని వైసీపీ.. రాష్ట్రం మీద ఈ స్థాయిలో కక్ష తీర్చుకోవడాన్ని ఏమనాలి.?