జనసేనాని పవర్‌ పంచ్‌: పేకాట క్లబ్లుపై ప్రేమ.. పాలన మీద ఏదీ.?

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మీరు పేకాట క్లబ్బులు నడుపుతూ రాజకీయం చేయొచ్చా.? మైనింగ్‌ అక్రమాలు, మీడియా వ్యాపారాలు, సిమెంట్‌ ఫ్యాక్టరీలు నడుపుతూ రాజకీయాలు చేయొచ్చా.? మేం మాత్రం సినిమాల్లో నటిస్తూ రాజకీయాలు చేయకూడదా.?’ అంటూ అధికార వైసీపీ మీద విరుచుకుపడ్డారు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌.

రాష్ట్రంలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప్రధానంగా పేకాట క్లబ్బుల వ్యవహారం అందర్నీ విస్మయానికి గురిచేస్తోన్న విషయం విదితమే. అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిథులే వీటిని నిర్వహిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. కేవలం ఆరోపణలు మాత్రమే కాదు, పేకాట క్లబ్బుల నిర్వహణ విషయమై.. అధికార పార్టీ ఎమ్మెల్యేలు చూపుతున్న చొరవకు సంబంధించి కొన్ని ఆడియో టేపులు వెలుగు చూశాయి.

అధికార పార్టీ నేతల అనుచరులు పేకాట క్లబ్బులు నిర్వహిస్తూ పోలీసులకు చిక్కిన వైనం కూడా తెరపైకొచ్చింది. కానీ, ఎంతైనా అధికార పార్టీకి చెందిన నేతల వ్యవహారాలు కదా.. తిమ్మిని బమ్మిని చేసినట్లుగా.. ఆయా కేసుల్ని నీరుగార్చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి.

‘పేకాట క్లబ్బుల మీద పెడుతున్న శ్రద్ధ పాలన మీద ఎందుకు పెట్టరు.? రోడ్లు చూస్తున్నారు కదా, ఎంత ఛండాలంగా వున్నాయో.. వీటి విషయమై మీ ప్రజా ప్రతినిథుల్ని మీరే నిలదీయాలి. ప్రజలకు అండగా జనసేన పార్టీ నిలబడుతుంది.. నేను నిలబడతాను.. తుది శ్వాస వరకూ. ఎదురు తిరిగితే దాడులు చేస్తారా.? చొక్కా పట్టుకుంటే, భయపడే రోజులు పోయాయ్‌.. చొక్కా పట్టుకుంటే, ఎదురు తిరిగి అదే పని చేసే రోజులొచ్చాయ్‌.. ప్రజల్ని భయపెడదామనుకుంటే ఇకపై కుదరదు. రోడ్డు మీదకు లాగేస్తారు ప్రజలు జాగ్రత్త..’ అంటూ జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ కృష్ణా జిల్లా గుడివాడలో రోడ్‌ షో సందర్భంగా చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీలో కలవరపాటుకు గురిచేశాయి.

మంత్రి కొడాలి నాని ప్రాతినిథ్యం వహిస్తోన్న నియోజకవర్గం గుడివాడ. నోటి దురుసుకి కేరాఫ్‌ అడ్రస్‌ అయిన కొడాలి నాని నియోజకవర్గం నుంచి, మొత్తం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ‘పవర్‌ పంచ్‌’ విసరడం గమనార్హం. మరి, ఈ విషయంపై అధికార పార్టీ అడ్డగోలు స్పందన ఎలా వుంటుందో చూడాలి మరి.!