తెలుగుదేశం పార్టీ.. తేనె పూసిన కత్తి.. ఇదిగో సాక్ష్యం.!

ఓ వైపు ప్రేమ బాణాలు సంధిస్తున్నారు.. ఇంకో వైపు ‘కుత్తుక’ కోసేందుకు కత్తికి పదును పెడుతున్నారు. ఇదీ తెలుగుదేశం పార్టీ తీరు.! 2014 ఎన్నికల్లో జనసేన మద్దతుని కోరింది తెలుగుదేశం పార్టీ. 2019 ఎన్నికల్లో జనసేన మీద విషం చిమ్మింది ఇదే తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు మళ్ళీ ‘వలపు బాణాల్ని’ సంధిస్తోంది తెలుగుదేశం పార్టీ, జనసేన మీదకి.

పైకి వలపు బాణాలు.. లోపలేమో నూరుతున్న కత్తులు.. ఇది తెలుగుదేశం పార్టీకి అలవాటైపోయిన రాజకీయం. ‘జనసేన పార్టీతో పొత్తు పెట్టకుందాం..’ అని టీడీపీ కార్యకర్త అడగడమేంటి.? ‘వన్ సైడ్ లవ్ వల్ల ప్రయోజనం లేదు..’ అంటూ చంద్రబాబు ముసిముసి నవ్వులు నవ్వడమేంటి.? ఇదంతా పెద్ద పొలిటికల్ స్కెచ్ మాత్రమే.

టీడీపీతో జనసేన పొత్తు ఖరారు.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయబోయే సీటు విషయమై స్పష్టతకు వచ్చిన టీడీపీ.. అంటూ, జనసేన అధినేతకు సంబంధించి కూడా టీడీపీనే సీట్లను ఖాయం చేస్తోండడమంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకేముంది.?

‘మీరు కాళ్ళు పట్టుకున్నా, ఈసారి మీకు మద్దతిచ్చేది లేదు. మీకు అంతగా కావాలనుకుంటే, మీరే మాకు మద్దతిచ్చి.. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవడానికి సహకరించండి..’ అంటూ ఎదురుదాడికి దిగింది జనసేన పార్టీ. ఒకప్పటి జనసేనకీ, ఇప్పటి జనసేనకీ వ్యూహాల్లో స్పష్టమైన తేడా వుంది. ‘ఇచ్చి పడేసే’ వ్యవహారాల్లో జనసేన చాలా చాలా ఆరితేరింది మరి.

అయితే, సోషల్ మీడియా వేదికగా మాత్రం తెలుగు తమ్ముళ్ళు కత్తులు నూరేస్తున్నారు జనసేన పార్టీ మీద. టీడీపీ అనుకూల మీడియా, టీడీపీ డిజిటల్ టీమ్.. జనసేన స్థాయిని తగ్గించేందుకు, జనసేన పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెంచేందుకూ పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు.

జనసేన అనేదే రాజకీయాల్లో లేకపోతే.. అంటూ, టీడీపీ చేస్తున్న ప్రచారంతో.. టీడీపీకి మరింత నష్టం జరుగుతుందన్న విషయాన్ని తెలుగు తమ్ముళ్ళు విస్మరిస్తున్నారు. జనసేనను కలుపుకుపోతే పది ఓట్లు అదనంగా వస్తాయేమోగానీ, జనసేన మీద విషం చిమ్మితే.. తెలుగుదేశం పార్టీ మరింత కుళ్ళి కుశించిపోతుంది తెలుగు తమ్ముళ్ళు తెలుసుకునేదెప్పుడో.?