పవర్స్టార్ పవన్ కల్యాణ్ సినిమా వచ్చేస్తోందంటే బాక్సాఫీస్ వద్ద ఆ సందడే వేరుగా వుంటుంది. అభిమానులు చేసే హంగామా మామూలుగా వుండదు. మూడేళ్ల విరామం తరువాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ `వకీల్ సాబ్` చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. గత ఏడాది కోవిడ్ సెకండ్ వేవ్ టైమ్ లో థియేటర్లలో సందడి చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లని సాధించి రికార్డులు సృష్టించింది.
ఈ మూవీ తరువాత రెట్టించిన ఉత్సాహంతో వరుస చిత్రాలని లైన్లో పెట్టారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. పిరియాడిక్ పాంటసీ డ్రామా `హరి హర వీరమల్లు` చిత్రంలో నటిస్తున్న ఆయన కొంత విరామం లభించడంతో మధ్యలో `భీమ్లా నాయక్`ని రాకెట్ స్పీడుతో పూర్తి చేశారు. సాగ్ కె. చంద్ర డైరెక్ట్ చేసిన ఈ మూవీ మలయాళ బ్లాక్ బస్టర్ `అయ్యప్పనుమ్ కోషియుమ్` ఆధారంగా రూపొందింది.
ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగ్స్ స్క్రీన్ ప్లే అందించారు. పవన్ తో కలిసి రానా నటించిన ఈ చిత్రంలో హీరోయిన్ లుగా నిత్యామీనన్ సంయుక్త మీనన్ నటించారు. సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ మూవీ `ఆర్ ఆర్ ఆర్` కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇదిలా వుంటే ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ నెట్టింట వైరల్ గా మారింది. పవన్ ఫ్యామిలీ ఫొటో అంటూ సోషల్ మీడియాలో ఓ ఫొటో హల్ చల్ చేస్తోంది.
ఇందులో పవన్ కు జోడీగా నిత్యామీనన్ నటించిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరితో పాటు ఫ్రేమ్ లో ఓ బాబు ఏడుస్తూ కనిపిస్తున్నాడు. ఈ జంటకు సినమాలో ఓ బాబు కూడా వుండటంతో ఆ ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. భీమ్లా నాయక్ ఫ్యామిలీ ఫొటో కావడంతో ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచింది.
అలాగే ఈ ఫొటోలో పవన్ వింటేజ్ లుక్ లో కనిపిస్తుండటం కూడా ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. `ఆర్ ఆర్ ఆర్` కారణంగా సంక్రాంతి రేస్ నుంచి తప్పుకున్న ఈ మూవీని ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి రిలీజ్ కి రెడీగా వున్న ఈ మూవీ ఫిబ్రవరి లో థియేటర్లలో సంచలనాలు సృష్టించడం ఖాయం అంటున్నారు.