`హరి హర వీర మల్లు` ఇంకా డిలే ఏంటీ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. జనసేనానిగా రాజకీయ షెడ్యూళ్లు ఓవైపు ఉన్నా.. సినిమాల కోసం ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. తాజా చిత్రం భీమ్లా నాయక్ ఈ నెలలోనే విడుదల కానుందని టాక్ వినిపిస్తోంది. నిర్మాతలు అధికారికంగా మరోసారి రిలీజ్ తేదీపై క్లారిటీ ఇవ్వనున్నారు.

ఈలోగానే పవన్ ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్ట్ హరి హర వీర మల్లుపై దృష్టి పెట్టారని తెలిసింది. ఇది చాలా కాలం నుండి చిత్రీకరణ దశలో ఉంది. కోవిడ్ వల్ల షెడ్యూల్స్ ఆలస్యమయ్యాయి. తాజాగా పవన్ కళ్యాణ్ హరి హర వీర మల్లు సినిమా షూటింగ్ ని మళ్లీ ప్రారంభించబోతున్నట్లు సమాచారం. ఫిబ్రవరి చివరి వారం నుంచి ఈ ప్రాజెక్ట్ కోసం పవన్ తన డేట్స్ కేటాయించినట్లు తెలుస్తోంది.

ఈసారి వన్ టైమ్ సెటిల్ మెంట్ ప్రకారం.. సెట్స్పైకి రాగానే హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ను సాంతం పూర్తి చేయాలని పవన్ భావిస్తున్నాడు. క్రిష్ ఈ చిత్రానికి దర్శకుడు కాగా.. ఈ చిత్రం పీరియాడిక్ యాక్షన్ డ్రామా. భారతదేశంలో ప్రవేశించిన బ్రిటీష్ వారి దోపిడీ నేపథ్యం.. కోహినూర్ వజ్రం నెమలి సింహాసనం దొంగతనం నేపథ్యంలో కొన్ని ఫిక్షనల్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా కంటెంట్ ఉంటుందని ఇంతకుముందు టాక్ వినిపించింది.

ఇది భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా కేటగిరీలో తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. పవన్ స్నేహితుడు ఏఎం రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్ తదుపరి హరీష్ శంకర్ .. సురేందర్ రెడ్డి లాంటి టాప్ డైరెక్టర్లతో పని చేయనున్నారు. ఇప్పటికే హరీష్ శంకర్ ప్రీప్రొడక్షన్ పనుల్ని పూర్తి చేస్తున్నారు.