రీమేక్ మూవీ కోసం పవన్ కు షాకింగ్ రెమ్యునరేషన్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇటీవల మలయాళ రీమేక్ ఆధారంగా తెరకెక్కిన `భీమ్లానాయక్`తో సాలీడ్ బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్యాన్స్ కి జాతర వాతావరణాన్ని తీసుకొచ్చింది. మునుపెన్నడూ చూడని విధంగా పవర్ స్టార్ మాసీవ్ అవతార్ లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించడమే కాకుండా వసూళ్ల పరంగానూ సంచలనాలు సృష్టించింది. సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు స్క్రీన్ ప్లే అందించిన విషయం తెలిసిందే.

రానా కీలక పాత్రలో నటించగా నిత్యామీనన్ సంయుక్త మీనన్ హీరోయిన్ లుగా నటించారు. ఈ మూవీ అందించిన సక్సెస్ జోష్ లో వున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ మూవీ తరువాత మరో రీమేక్ ని సెట్స్ పైకి తీసుకెళ్లడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం క్రిష్ డైరెక్ట్ చేస్తున్న పిరియాడిక్ ఫిల్మ్ `హరి హర వీరమల్లు` చిత్రంలో నటిస్తున్న పవన్ కల్యాణ్ ఈ మూవీతో పాటు ప్యారలల్ గా మరో రీమేక్ చిత్రాన్ని పట్టాలెక్కించబోతున్నారు.

తమిళంలో సముద్రఖని నటించి తెరకెక్కించిన చిత్రం `వినోదాయ సితం`. థియేటర్లలో కాకుండా డైరెక్ట్ ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించడమే కాకుండా విమర్శకుల ప్రశంసల్ని సొంతం చేసుకుంది. దైవ దూత పాత్ర ప్రధానంగా సాగే ఈ మూవీని తెలుగులో త్వరలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో రీమేక్ చేయబోతున్నారు. పవన్ కల్యాణ్ కు చెందిన పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ ఈ మూవీ రీమేక్ హక్కుల్ని సొంతం చేసుకుంది. ఈ బ్యానర్ తో పాటు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ త్రవిక్రమ్ జీ స్టూడియోస్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించబోతున్నారు.

అంటే పవన్ కోసం ముగ్గురు నిర్మాతలుగా ఈమూవీ కోసం రంగంలోకి దిగడం ఆసక్తికరంగా మారింది. ఇందులో ప్రతీ ఒక్కరు 25 శాతం లాభాల్లో వాటాని పొందాలనే అగ్రిమెంట్ తో ఈ ప్రాజెక్ట్ ని టేకప్ చేస్తుండటం గగమనార్హం. ఈ మూవీ కోసం పవన్ కేవలం 20 రోజులు కేటాయిస్తున్నారట. ఇందుకు 60 కోట్లు పారితోషికం తీసుకుంటున్నారని తెలిసింది. అంతే కాకుండా ఇందులో యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ కూడా కీలక పాత్రలో నటించబోతున్నారు. ఇందు కోసం సాయి ధరమ్ తేజ్ 8 కోట్లు తీసుకుంటున్నారట.

యాక్సిడెంట్ తరువాత సాయి ధరమ్ తేజ్ నటించబోతున్న ఫస్ట్ మూవీ ఇదే కాబోతోంది. గతంలో పవన్ – సాయి ధరమ్ తేజ్ ఓ ప్రాజెక్ట్ చేయాలని ఫిక్సయ్యారు. అందులో భాగంగానే ఈ ప్రాజెక్ట్ ని ఇద్దరూ కలిసి చేస్తున్నారని చెబుతున్నారు. గత ఏడాది జీ5లో విడుదలైన `వినోదాయ సితం` చిత్రాన్ని ఈ ఇద్దరు హీరోలకు తగ్గట్టుగా త్రివిక్రమ్ సముద్ర ఖని మార్పులు చేర్పులు చేస్తున్నారు. స్క్రిప్ట్ వర్క్ ఫైనల్ స్టేజ్ కి రావడంతో త్వరలోనే ఈ రీమేక్ ని సముద్రఖని డైరెక్షన్ లో స్టార్ట్ చేయబోతున్నారని తెలిసింది.