ఏపీలో విద్యుత్ కోతలకు వైసీపీ ప్రభుత్వ విధానాలే కారణం: పవన్ కల్యాణ్

విద్యుత్ కోతలతో ఏపీ ప్రజలు అల్లాడిపోతున్నారని.. వైసీపీ ప్రభుత్వ అనాలోచిత ధోరణే ఇందుకు కారణమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఏపీ విద్యుత్ కోతలపై ఆయన స్పందిస్తూ.. ‘గ్రామాల్లో 11-14, పట్టణాల్లో 5-8, నగరాల్లో 4-6 గంటలపాటు అనధికార కోతలు విధిస్తున్నారు. 2014లో మిగులు విద్యుత్తు ఉన్న రాష్ట్రంగా ఏపీ.. ఇప్పుడు లోటు విద్యుత్ రాష్ట్రం అయింది. సెల్ ఫోన్ల వెలుతురులో శస్త్రచికిత్సలు చేయాల్సి వస్తోంది. పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్ధులు కోతలతో అల్లాడుతున్నారు’.

‘అధికారంలోకి వస్తే 200 యూనిట్లు ఉచితంగా ఇస్తామని.. విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని.. ఇప్పుడు ఏకంగా 57శాతం చార్జీలు పెంచారు. గత ప్రభుత్వ హయాంలో యూనిట్ రూ.4.80 చొప్పున 25 ఏళ్లకు గ్రీన్ ఎనర్జీతో చేసుకున్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసుకుని ఇప్పుడు యూనిట్ కు 20 చొప్పున కోల్ ఎనర్జీ నుంచి కొంటోంది. విధానాలపై మేము ప్రశ్నిస్తుంటే.. వైసీపీ నేతలు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. మా సహనాన్ని పరీక్షించొద్దు’ అని అన్నారు.