పవన్ సినిమా ఆగిపోయిందన్న వార్తలపై క్లారిటీ

ఈమద్య కాలంలో సినిమాలను ప్రకటించి వాటిని పక్కకు పెట్టడం చాలానే చూశాం. చిన్న హీరోల విషయంలో ఇలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. పెద్ద హీరోల విషయంలో అప్పుడప్పుడు జరుగుతుంది. కొన్ని కారణాల వల్ల సినిమా ప్రకటించిన తర్వాత క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. ఇప్పడు పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ప్రకటన వచ్చిన భవదీయుడు భగత్ సింగ్ సినిమాను క్యాన్సిల్ చేశారు అంటూ వార్తలు వస్తున్నాయి.

గత రెండు మూడు రోజులుగా ఈ విషయమై ప్రముఖంగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా ఏడాది క్రితమే ప్రకటన వచ్చింది. కాని ఏవో కారణాల వల్ల సినిమా ను మొదలు పెట్టలేదు. ఈ సమయంలోనే హరీష్ శంకర్ ముంబయి వెళ్లి ఒక బాలీవుడ్ స్టార్ హీరోతో చర్చలు జరిపాడు. దాంతో ఆయన హిందీ సినిమా చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మరో వైపు పవన్ కళ్యాణ్ కూడా ఒక రీమేక్ చేసేందుకు సిద్ధం అయ్యాడు అంటూ ప్రచారం జరుగుతోంది.

పవన్ మరియు హరీష్ శంకర్ లు వేరు వేరు సినిమాలు చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో వీరిద్దరి కాంబోలో రావాల్సిన భవదీయుడు భగత్ సింగ్ సినిమా క్యాన్సిల్ అయ్యింది అంటూ ఊహాగాణాలు మొదలు అయ్యాయి. కాని మైత్రి మూవీ మేకర్స్ వారు ఆ వార్తలు కొట్టి పారేశారు. మీడియాలో వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని వారు క్లారిటీ ఇచ్చారు. భవదీయుడు భగత్ సింగ్ సినిమాను త్వరలోనే పట్టాలెక్కిస్తాం అంటూ ప్రకటించారు.

పవన్ మరియు హరీష్ శంకర్ ల కాంబోలో గతంలో గబ్బర్ సింగ్ వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కనుక ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇలా అంచనాలు భారీగా ఉన్న సినిమా క్యాన్సిల్ అయ్యిందంటూ పుకార్లు షికార్లు చేయడం తో మెగా అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు. వీరిద్దరి కాంబో సినిమా రావాల్సిందే అంటూ చాలా మంది అభిమానులు కోరుతున్నారు.

పవన్ అభిమానుల కోరిక మేరకు హరీష్ శంకర్ మూవీ క్యాన్సిల్ అవ్వలేదు అని క్లారిటీ వచ్చింది. మైత్రి మూవీ మేకర్స్ అనధికారికంగా పుకార్లపై స్పందించి సినిమా క్యాన్సిల్ కాలేదు.. ఆగిపోలేదు అంటూ స్పష్టత ఇవ్వడం తో గందరగోళం కు తెర పడ్డట్టు అయ్యింది. ఇంకా ఎన్నాళ్లకు ఈ సినిమా మొదలు పెడతారు అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

సినిమా పట్టాలెక్కే వరకు ఇలాంటి పుకార్లు తప్పవు అని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. క్రిష్ దర్శకత్వంలో ఆ సినిమాను చేస్తూ మద్య మద్యలో రాజకీయాలు కూడా చేస్తున్నాడు. దాంతో వీరమల్లు సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుంది. క్రిష్ మూవీ పూర్తి అయిన వెంటనే భవదీయుడు మొదలు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.