ఏరు దాటేదాకా ఓడ మల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న.. అన్నట్టు బీజేపీ వ్యవహారం సాగుతోందనే ఆవేదన జనసేన పార్టీ వర్గాల్లో కనిపిస్తోంది. గ్రేటర్ ఎన్నికల వేళ జనసేన – బీజేపీ మధ్య పంచాయితీ ముదిరి పాకాన పడిన విషయం విదితమే. తెలంగాణ బీజేపీ నేతలు కొందరు, జనసేనను లెక్క చేయకపోయినా, గ్రేటర్ ఎన్నికల్లో తమ గెలుపుకు సహకరించాలంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సహా పలువురు బీజేపీ నేతలు, స్వయంగా జనసేన అధినేత వద్దకు వెళ్ళి.. అభిప్రాయ బేధాల్ని చల్లార్చే ప్రయత్నం చేశారు.
తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల వేళ, మరో బీజేపీ నేత ‘తెలంగాణలో బీజేపీ – జనసేన మధ్య పొత్తు లేదు’ అని ప్రకటించడం జనసైనికుల్ని తీవ్ర ఆవేదనకు గురిచేసింది. ఈ వ్యవహారంపై బీజేపీ ముఖ్య నేతలు కొందరు, జనసేన అధినేతకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా, జనసేన మాత్రం మెత్తబడలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతిచ్చింది జనసేన. ఇదే విషయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా వెల్లడించారు.
‘మేం టీఆర్ఎస్ పార్టీ అన్న కోణంలో ఆలోచించలేదు.. పీవీ నరసింహారావు కుటుంబానికి చెందిన వ్యక్తిని అభ్యర్థిగా చూశాం. మాకు గౌరవం దక్కని చోట మా మిత్రపక్షంతో మేం కలిసి వెళ్ళలేం. జాతీయ స్థాయిలో దక్కుతున్న గౌరవం రాష్ట్ర స్థాయిలో కూడా దక్కాల్సిందే..’ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా వ్యాఖ్యానించారు. తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో ఏపీ బీజేపీ నేతలు కొందరు చేసిన వ్యాఖ్యలపైనా పవన్ అప్పట్లో ఇలానే స్పందించిన విషయం విదితమే.
అయితే, బీజేపీతో ఇలా ‘గిల్లికజ్జాల’ నడుమ స్నేహం కొనసాగించడం వల్ల జనసేనకు ఉపయోగముండదనే భావన జనసైనికుల్లో వ్యక్తమవుతోంది. ‘గెలిచినా, ఓడినా.. పార్టీ తరఫున అభ్యర్థుల్ని నిలబెట్టడం ద్వారా ఆయా ఎన్నికల్లో ఓటర్ల మనసుల్ని గెలుచుకోగలుగుతాం.. ఈ విషయంలో జనసేనాని మరింత లోతుగా ఆలోచించాలి..’ అని జనసైనికులు సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేస్తున్నారు.