తిరుపతి ఉప ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో బీజేపీ జోరు పెంచింది. ప్రచారపర్వాన్ని ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా సోమవారం నెల్లూరు జిల్లా నాయుడుపేటలో బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఏఎల్సీఎం క్రీడా ప్రాంగణంలో జరిగే ఈ మహాసభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతోపాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు.
ఈ సందర్భంగా సభాస్థలిలో జరుగుతున్న ఏర్పాట్లను స్థానిక బీజేపీ నేతలు పరిశీలించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కరోనా నిబంధనలు పాటిస్తూ సభ నిర్వహించబోతున్నట్టు వారు వెల్లడించారు. సభ సోమవారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సాగుతుందని పేర్కొన్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో అధికార వైసీపీ నుంచి డాక్టర్ గురుమూర్తి బరిలో ఉండగా.. టీడీపీ నుంచి పనబాక లక్ష్మి, బీజేపీ నుంచి రత్నప్రభ పోటీలో ఉన్న సంగతి తెలిసిందే.