రెండు రోజుల క్రితం పవన్ కల్యాణ్ కు కరోనా సోకడంతో క్వారంటైన్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన ఆరోగ్యం కుదుటపడుతోందని.. తాను కోలుకోవాలని పూజలు చేసినవారితోపాటు, కోరుకున్నవారికి ధన్యవాదాలు చెప్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. తాను వైద్యుల సూచనలు పాటిస్తున్నానని తెలిపారు. వీలైనంత త్వరగా కోలుకుని మీముందుకు వస్తాను అని ప్రకటించారు. ఈక్రమంలో కరోనా ఉధృతి ఎక్కువగా ఉందని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
తెలుగు రాష్ట్రాల్లో కరోనా తీవ్రత ఆందోళన కలిగిస్తోందని అన్నారు. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు మరింత సన్నద్ధతతో వ్యవహరించాలని కోరారు. రీసెంట్ గా పవన్ కల్యాణ్ భద్రతా సిబ్బందిలో కొందరికి కరోనా సోకడంతో ముందస్తుగా క్వారంటైన్ లో ఉన్నారు పవన్. అయితే.. స్వల్ప లక్షణాలు కనిపించడంతో రెండు రోజుల క్రితం టెస్టులు చేయించుకోగా ఆయనకు పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో హైదరాబాద్ శివారులోని ఆయన ఫామ్ హౌస్ లో క్వారంటైన్ లో ఉన్నారు.