‌‌‌‌‌‌బ్లాక్ లిస్టులో పెడతాం: అధికారులకు మంత్రి పెద్దిరెడ్డి ‘బెదిరింపు’.!

బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు ఇంతకన్నా నిదర్శనం ఇంకేముంటుంది.? ‘ఆయన ఏం చేసుకున్నా మార్చి 31 వరకే. ఆయన మాటల్ని ఎవరూ పట్టించుకోవద్దు. ఆయన ఇచ్చే ఆదేశాల్ని పాటించాల్సిన అవసరం లేదు. అలా కాదని, ఎవరైనా ఆయన ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటే.. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే, మేం అధికారంలో వున్నన్నాళ్ళూ ఆయా అధికారులను బ్లాక్ లిస్టులో పెట్టేస్తాం..’ అంటూ సాక్షాత్తూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాష్ట్రంలో అధికారులకు అల్టిమేటం జారీ చేశారు. ఇంతకన్నా పెద్ద బెదిరింపు ఇంకేముంటుంది.?

ఎన్నికల్లో అధికార పార్టీకి సహకరించకపోతే, ఆయా అధికారుల్ని బ్లాక్ లిస్టులో పెట్టేస్తారా.? సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుని ఇలాగే బ్లాక్ లిస్టులో పెట్టి, వేధింపులకు పాల్పడుతోంది జగన్ సర్కార్.. అని అనుకోవాల్సందేనా.? చాలామంది అధికారుల్ని వైసీపీ, అలా బెదిరించే తమ దారిలోకి తెచ్చుకుందా.? తమ దారిలోకి రాకపోతే, అధికారులకు వేధింపులు తప్పవా.? అంటూ, జన బాహుళ్యంలో చర్చ షురూ అయ్యింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇంతలా ఆగ్రహావేశాలు తన్నుకురావడానికి బలమైన కారణం లేకపోలేదు.

పెద్దిరెడ్డి సొంత జిల్లా చిత్తూరులో ఏకగ్రీవాలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంచలన ఆదేశాలు జారీ చేశారు. చిత్తూరుతోపాటు, గుంటూరు జిల్లాలో జరిగిన ఏకగ్రీవాలకు సంబంధించి నివేదికలు ఇవ్వాల్సిందిగా సంబంధిత అధికారుల్ని నిమ్మగడ్డ ఆదేశిస్తూ, ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకునేదాకా ఏకగ్రీవాలను అధికారికంగా ప్రకటించొద్దని స్పష్టం చేశారు. చాలా చాలా కష్టపడి మరీ చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో అత్యధికంగా ఏకగ్రీవాల్ని చేయించుకుంది అధికార వైసీపీ. అవెలా జరిగాయో అందరికీ తెల్సిందే. బెదిరింపులు, ప్రలోభాలు.. వెరసి పెద్ద కథే నడిచింది. ఆ కథేంటో తేల్చాలని నిమ్మగడ్డ ప్రయత్నిస్తుండడమే పెద్దిరెడ్డికి ఆగ్రహం తెప్పిస్తోంది.

అయినా, అధికారుల్ని బెదిరించడమేంటి.? బ్లాక్ లిస్టులో పెడతామనడమేంటి.? అదీ ఎన్నికల కోడ్ అమల్లో వున్నప్పుడు ఓ మంత్రి, అధికారులకు అల్టిమేటం జారీ చేయడమంటే.. దీన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ఒకింత సీరియస్‌గా తీసుకోవాల్సిందే.