ఏవండోయ్ నానీగారూ.. అది సినిమా రివ్యూ కాదు, కరోనా రివ్యూ.!

‘వకీల్ సాబ్’ సినిమా రివ్యూ కాదది.. ‘కరోనా రివ్యూ’. కాస్త ఆచి తూచి మాట్లాడితే బావుంటుందేమో అమాత్యులు. మంత్రి పేర్ని నాని, మీడియా ముందు ఆవేశపూరిత ప్రసంగాలు చేయడంలో దిట్ట. రాజకీయ ప్రత్యర్థులపై.. మరీ ముఖ్యంగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద ‘పవన్ నాయుడు’ అంటూ సెటైర్లేయడంలో ఘనాపాటి. అన్నట్టు, ఆ మధ్య ‘వకీల్ సాబ్’ సినిమా మీద రివ్యూ చెప్పి, నవ్వులపాలయ్యారు ఈ నానిగారే. ఈయన ఇప్పుడు కరోనా మీద రివ్యూ చేసేశారు మీడియా ముఖంగా. ఇదెక్కడి చోద్యం.?

వ్యాధి ముదిరేవరకూ ఇంట్లో కూర్చుని, ముదిరాక ఆసుపత్రులకొచ్చి ఆక్సిజన్ కావాలి, మంచం కావాలి.. అంటూ రోగులొస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేసేశారు పేర్ని నాని. ఇదెక్కడి చోద్యం.? కరోనా వైరస్ సోకినా, చాలామందికి తేలిగ్గానే నయమైపోతుందని ప్రభుత్వమే చెబుతోంది. ‘ఇట్ కమ్స్.. ఇట్ గోస్.. వస్తుంది, పోతుంది..’ అని సాక్షాత్తూ ముఖ్యమంత్రే సెలవిచ్చారు. పారాసిటమాల్ వేసుకుంటే తగ్గిపోయే వ్యవహారమని కూడా గతంలో ముఖ్యమంత్రి సెలవిచ్చిన విషయాన్ని ఎలా మర్చిపోగలం.?

ఆక్సిజన్ లెవల్స్ తగ్గినప్పుడే కదా, ఆసుపత్రికి వెళ్ళాలని ప్రభుత్వం సూచిస్తోంది. అలాంటప్పుడు వస్తున్న రోగులకే వైద్య చికిత్స అందించాల్సి వుంటుంది ఆసుపత్రుల్లో. అందులో చాలామందికి ఆక్సిజన్ అవసరమవుతోంది. కానీ, వారికి ఆక్సిజన్ అందించడంలో విఫలమవుతోంది ప్రభుత్వం. అదే అసలు సమస్య. ఆసుపత్రుల్లో బెడ్స్ ఖాళీగా వుండటంలేదు. చెట్టు కింద కూర్చబోట్టి ఆసుపత్రి ఆవరణలోనే ఆక్సిజన్ అందిస్తున్నారు. తమంతట తాము ఆక్సిజన్ సిలెండర్లను బయటనుంచి తెచ్చుకుంటే తప్ప, వైద్యం పొందలేని దుస్థితి కొందరు రోగులది. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే.

రాజకీయ ప్రత్యర్థుల మీద కక్ష సాధింపు చర్యల కోసం ప్రభుత్వ పెద్దలు పెట్టిన ఫోకస్ కరోనా వైరస్ మీద పెట్టి వుంటే, రాష్ట్రంలో ఈ దుస్థితి వచ్చి వుండేది కాదు. మరీ ముఖ్యంగా ‘వకీల్ సాబ్’ సినిమా మీద పెట్టిన ఫోకస్ లో పదో వంతు, కాదు కాదు వందో వంతు ఫోకస్ పెట్టినా, రాష్ట్రంలో సామాన్యుడిలా ఆక్సిజన్ అందక విలవిల్లాడే పరిస్థితి వచ్చేది కాదు.