ఆమధ్య కేరళ ను కుదిపేసిన 30 కేజీల బంగారం స్మగ్లింగ్ కేసులో సీఎం పినరయి విజయన్ పేరు బయటకు రావడం.. అదీ ఎన్నికల వేళ తీవ్ర కలకలం రేపుతోంది. తిరువనంతపురంలోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కాన్సులేట్‌కు వస్తున్న పార్శిల్‌లో 15 కోట్లు విలువచేసే బంగారాన్ని కస్టమ్స్ అధికారులు గుర్తించారు. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేరళ ఐటీ శాఖలో పనిచేస్తున్న స్వప్న సురేశ్ సీఎంకు ఇందులో సబంధం ఉందని దర్యాప్తులో చెప్పడం సంచలనం రేపుతోంది.
ఈ స్మగ్లింగ్ వ్యవహారంలో సీఎం, ముగ్గురు మంత్రుల పేర్లతోపాటు స్పీకర్ కూడా పాత్రధారులని ఆమె వెల్లడించారు. ‘సీఎం విజయన్ అరబ్బీ భాషలో మాట్లాడలేనందున.. కాన్సులేట్ జనరల్‌కు ఆయనకు మధ్య మీడియేటర్ గా స్వప్న సురేశ్ వ్యవహరించారు. కోట్లాది రూపాయలు వీరందరికీ కమిషన్‌గా ముట్టిందని స్వప్న సురేశ్ దర్యాప్తులో వెల్లడించారు’ అని కస్టమ్స్ అధికారులు కేరళ హైకోర్టుకు వెల్లడించారు. దీంతో ఈ కేసు సంచలనంగా మారింది. ప్రతిపక్షాలు తమ విమర్శలకు మరింత పదును పెట్టాయి.