మోదీ పనితీరుపై ఆరెస్సెస్ గుస్సా

కరోనా విపత్తు నుంచి దేశాన్ని కాపాడే విషయంలో కేంద్రంలోని మోదీ సర్కారుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే అంతర్జాతీయ మీడియా ఈ విషయంలో మోదీనే ప్రధానంగా తప్పుబట్టగా.. తాజాగా బీజేసీ సైద్ధాంతిక మార్గదర్శి ఆరెస్సెస్ సైతం మోదీ పనితీరుపై మండిపడింది. ముఖ్యంగా ఢిల్లీలో కరోనా కట్టడిపై కేంద్ర సర్కారు అనుసరిస్తున్న వైఖరిని దుయ్యబట్టింది. ఈ విషయంలో ఆరెస్సెస్ అధినాయకత్వం పెదవి విప్పకపోయినా.. ఆరెస్సెస్ ఢిల్లీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాజీవ్ తుల్లి మాత్రం బహిరంగా విమర్శలు చేశారు. కరోనాతో ఢిల్లీ అతలాకుతలం అవుతుంటే ప్రజలకు సాయం చేసే విషయంలో బీజేపీ నేతలు ఎక్కడా కనపడటంలేదని విమర్శించారు.

ఢిల్లీ వాసులకు అండగా నిలవాల్సిన బీజేపీ నేతల తీరు ఇదేనా అని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీ కార్యవర్గాన్ని రద్దు చేశారా అని ఎద్దేవా చేశారు. రాజీవ్ వ్యాఖ్యలపై సంఘ్ వర్గాలు పైకి సమర్థించడంలేదు. అలా అని వ్యతిరేకించడమూ లేదు. అంతర్గతంగా ఆ వర్గాలు కూడా ఇలాంటి అభిప్రాయమే కలిగి ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, రాజీవ్ వ్యాఖ్యలపై ఆరెస్సెస్ అఖిల భారత ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేడ్కర్ మాత్రం స్పందించారు. ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ పార్టీలకు అతీతంగా కదలి రావాలని అభిప్రాయపడ్డారు. రాజీవ్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని.. వాటితో సంఘ్ కు సంబంధం లేదని స్పష్టంచేశారు.