ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు, గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. యావత్ భారతావని ఆయన కోలుకుని క్షేమంగా తిరిగిరావాలని కోరుకుంటోంది. ఇటివల ఆయన ఆరోగ్య పరిస్థితిపై వచ్చిన వదంతుల నేపథ్యంలో ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ ఎప్పటికప్పుడు ఆయన తన తండ్రి ఆరోగ్య పరిస్థితి వివరిస్తున్నారు. బాలు గారి ఆరోగ్యం కాస్త మెరుగు పడింది. ఇదివరకటి కంటే ఇప్పుడు శ్వాస తేలిగ్గా తీసుకోగలుగుతున్నారు. ఐసీయూలో డాక్టర్లు అడిగే ప్రశ్నలకు స్పందిస్తున్నారు’ అని వెల్లడించారు. ప్రస్తుతం ఆయన చెన్నైలోని ఎంజీఎం హెల్త్ కేర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే.
బాలు ఆరోగ్యంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆసుపత్రి వర్గాలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రధానమంత్రి కార్యాలయం కూడా ఆరా తీసినట్టు తెలుస్తోంది. ఆస్పత్రి వర్గాలతో ఆయన చికిత్స గురించి అడిగి తెలుసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. తమిళనాడు సీఎం పళనిస్వామి కూడా బాలు ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు. తమిళ నటుడు రజినీకాంత్ కూడా బాలు క్షేమంగా తిరిగి రావాలని ఓ వీడియోలో ఇచ్చిన సందేశంలో కోరుకున్నారు. 50 ఏళ్లుగా బాలు తన గాత్రంతో కోట్లాదిమందిని రంజింపజేశారన్నారు. ఆయన క్షేమంగా ఉన్నట్టు తెలుసుకుని సంతోషించానని అన్నారు. గెట్ వెల్ సూన్ బాలు సర్.. అంటూ ఆయన ట్వీట్ చేశారు.
ఆయన ఆరోగ్యంతో క్షేమంగా తిరిగి రావాలని చిరంజీవి, పవన్ కల్యాణ్ తో సహా ఎందరో ట్వీట్ చేశారు. బాలు కోలుకుని తన ఇనిస్టిట్యూట్ లో పాటలు పాడాలని ఆ సాయినాధుడ్ని కోరుకుటున్నాను అని మోహన్ బాబు ట్వీట్ చేశారు.