రామగుండం బొగ్గు గనిలో సలార్ షూటింగ్ మొదలు

రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్ షూటింగ్ ను పూర్తి చేసి తన తర్వాతి చిత్రం సలార్ షూటింగ్ ను మొదలుపెట్టాడు. రామగుండంలో సలార్ షూటింగ్ ఈరోజు నుండి మొదలైంది. ఈ సినిమా షూటింగ్ నిమిత్తం ప్రభాస్, రామగుండం సిపి సత్యనారాయణను కలిశారు. ప్రభాస్ రావడంతో కమిషనర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున అభిమానులు గుమీగూడారు. రామగిరి మండలంలోని ఓసిపి-2లో సలార్ షూటింగ్ జరుపుకుంటోంది. చిత్ర బృందం ఆర్జీ-3 పరిధిలోని ఓసీపీ-2 ప్రాజెక్టు వద్ద స్పెషల్ సెట్ ను నిర్మించారు. ఇక్కడే సలార్ కు సంబంధించిన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

సలార్ మూవీ టీమ్ కు సింగరేణి అతిథి గృహాలను కేటాయించినట్లు తెలుస్తోంది. హోంబలే ఫిలింస్‌ బ్యానర్‌పై విజయ్‌ కిరంగందూరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అలాగే భువనగౌడ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా రవి బస్రూర్ సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు. శృతి హాసన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న విషయాన్ని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.