2022-23 ఇండియన్ బాక్సాఫీస్ నెం.1 ప్రభాస్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందిన రాధే శ్యామ్ విడుదలకు సిద్దం అయ్యింది. అది 2022 సంక్రాంతికి విడుదల కాబోతున్నట్లుగా ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది. ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల తేదీ ప్రకటించిన నేపథ్యంలో ఆ సినిమా విడుదల తేదీ విషయంలో ఏమైనా మార్పు వస్తుందేమో అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కాని ఇప్పటి వరకు విడుదల తేదీ విషయంలో యూవీ క్రియేషన్స్ వారి నుండి ఎలాంటి అప్ డేట్ రాలేదు. కనుక ఇప్పటి వరకు అయితే సంక్రాంతికే రాధే శ్యామ్ వస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. ఇక కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సలార్ సినిమా ను కూడా వచ్చే ఏడాదిలో విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. వచ్చే ఏడాది సమ్మర్ లో సలార్ అంటున్నారు. కాస్త అటు ఇటు అయినా కూడా జూన్ జులైలో సలార్ విడుదల ఉంటుందని మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు. ఈ రెండు సినిమాలు కాకుండా ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న మరోసినిమా ఆదిపురుష్ ఈ సినిమా ను 2022 ఆగస్టులోనే విడుదల చేసి తీరుతాం అనే నమ్మకంను చిత్ర యూనిట్ సభ్యులు మరోసారి వ్యక్తం చేశారు.

సినిమా విడుదల తేదీ మారుతుందని అనుకుంటే అదే తేది అంటూ చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా వెళ్లడించారు. ఆదిపురుష్ 2022 లో ఆగస్టులో కాకున్నా చివరి వరకు అయినా విడుదల పక్కా. ఇక 2023 లో కూడా ప్రభాస్ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రాబోతున్నాయి. మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే ను ప్రభాస్ చేస్తున్నాడు. పాన్ వరల్డ్ మూవీగా ఆ సినిమా రూపొందుతున్నట్లుగా చెబుతున్నారు. ఆ సినిమా ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుంది. వచ్చే ఏడాది ఆరంభం నుండి షూటింగ్ రెగ్యులర్ గా జరిపి 2023 లో విడుదల చేస్తామని యూనిట్ సభ్యులు అంటున్నారు. 2023 లో ప్రభాస్ 25వ సినిమాను కూడా విడుదల చేస్తారని అంటున్నారు. ఈ అయిదు సినిమాలు ఖచ్చితంగా 2022 మరియు 23 ల్లో విడుదల అవ్వడం పక్కా. ఈ అయిదు సినిమాలు కూడా పాన్ ఇండియా రేంజ్ లో భారీ అంచనాలు కలిగి ఉన్నాయి. తక్కువలో తక్కువ అయిదు సినిమాలు రెండు వేల కోట్ల వరకు వసూళ్లు చేస్తాయనే నమ్మకంను విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

ఒక ఇండియన్ హీరో రెండేళ్లలో రెండు వేల కోట్ల వసూళ్లు సాధించడం అంటే మామూలు విషయం కాదు. భారీ సినిమాలు అయిదు ఆరు వందల కోట్లు సాధించడం మనం చూస్తూనే ఉంటాం. కాని రెండేళ్లలో అలాంటి సినిమాలు రెండు మూడు రావడం కూడా సాధ్యం అయ్యే అవకాశం లేదు అనేది అందరి అభిప్రాయం. కాని ప్రభాస్ అసాధ్యంను సుసాద్యం చేయబోతున్నట్లుగా అభిమానులు ధీమాగా చెబుతున్నారు. ఆయన సన్నిహితులు కూడా రాబోయే రెండు సంవత్సరాల్లో బాక్సాఫీస్ కా కింగ్ ఖచ్చితంగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అంటూ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ పక్కా ప్లానింగ్ తో అద్బుతంగా సినిమాలను చేసుకుంటూ అన్ని సినిమాలను రెండేళ్లలోనే విడుదల చేసేందుకు సిద్దం చేయడం తో ఖచ్చితంగా ఆరెండేళ్లకు గాను నెం.1 స్టార్ గా నిలవడం ఖాయం అంటున్నారు. ప్రభాస్ రాబోయే రెండేళ్లలో ఈ అయిదు సినిమాలే కాకుండా మరో ఒకటి రెండు సినిమాలు విడుదల చేసినా ఆశ్చర్యం లేదు.