రెబెల్ స్టార్ ప్రభాస్ బాహుబలి చిత్రంతో ఇండియా వైడ్ ఫేమ్ తెచ్చుకున్నాడు. ఈ సినిమా తర్వాత బాలీవుడ్ దర్శకులు, నిర్మాతల దృష్టి ప్రభాస్ పై పడింది. ఎలాగైనా ప్రభాస్ తో ఒక సినిమా తీయాలని ప్రయత్నిస్తున్నారు. అయితే బాహుబలి విడుదల కంటే ముందే ప్రభాస్ రెండు సినిమాలకు కమిటైపోయాడు. అందులో ఒకటి సాహో ఇప్పటికే విడుదలైపోగా, రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో చేస్తోన్న రాధే శ్యామ్ వచ్చే ఏడాది విడుదల కానుంది. దీని తర్వాత నాగ్ అశ్విన్ చిత్రాన్ని కూడా ఓకే చేసాడు ప్రభాస్.
ఈ రెండు సినిమాలు పూర్తయ్యాక ప్రభాస్ కచ్చితంగా బాలీవుడ్ సినిమా చేస్తాడని ప్రచారం జరుగుతోంది. సాహోలో కొన్ని పోర్షన్స్ ను హిందీలో కూడా తెరకెక్కించారు కానీ దాన్ని పూర్తిగా తెలుగు సినిమాలనే చూస్తున్నారు. హిందీలో ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ప్రభాస్ బాలీవుడ్ దర్శకులు, నిర్మాతలతో పనిచేయాలన్న ఒత్తిడి ఎక్కువవుతోంది.
అయితే రాధే శ్యామ్, నాగ్ అశ్విన్ సినిమా పూర్తయ్యాక కచ్చితంగా ప్రభాస్ బాలీవుడ్ ప్రాజెక్ట్ చేయబోతున్నాడట. ఇందుకోసం దర్శకుడు కూడా కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ లో అజయ్ దేవగన్ తో తానాజీను తెరకెక్కించిన ఓం రౌత్ తో ప్రభాస్ పనిచేస్తాడని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రాధమిక చర్చలు కూడాపూర్తయ్యాయట. ప్రభాస్ సొంత బ్యానర్ యూవీ క్రియేషన్స్ ఈ టాక్స్ ను నడుపుతున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు వచ్చే ఏడాది బయటకు వచ్చే అవకాశముంది.