మరో చిత్రాన్ని ఓకే చేసిన ప్రభాస్… అదే ముందు వస్తుంది!

రెబెల్ స్టార్ ప్రభాస్ దూకుడు ఇప్పుడు మాములుగా లేదు. వరసగా సినిమాలను అనౌన్స్ చేస్తున్నాడు. అన్నీ కూడా భారీ చిత్రాలు, ప్యాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కేవి కావడం విశేషం. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. ప్రభాస్ సినిమా రాధే శ్యామ్ ప్రస్తుతం సెట్స్ పై ఉన్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ త్వరలో మొదలవుతుంది. నాన్ స్టాప్ షెడ్యూల్స్ తో డిసెంబర్ కల్లా ఈ చిత్రాన్ని పూర్తి చేయాలనుకుంటున్నారు.

ఇక వచ్చే ఏడాది ఆది పురుష్, నాగ్ అశ్విన్ చిత్రాలు చేయాలని ముందుగా భావించాడు ప్రభాస్. ఈ రెండు సినిమాలు 2022లో విడుదలవుతాయని ప్లాన్ చేసాడు. అయితే ఇప్పుడు ప్లాన్ లో చిన్న మార్పు వచ్చింది. ప్రభాస్ మరో సినిమాను ఓకే చేసినట్లుగా తెలుస్తోంది.

ప్రశాంత్ నీల్ చెప్పిన కథ ప్రభాస్ కు తెగ నచ్చేసినట్లుగా సమాచారం. పూర్తి మాస్ స్థాయి కథతో ప్రశాంత్ నీల్ ప్రభాస్ ముందుకు వచ్చినట్లుగా తెలుస్తోంది. రాధే శ్యామ్ తర్వాత ఇమ్మీడియేట్ ప్రాజెక్ట్ గా ప్రశాంత్ నీల్ సినిమా చేయనున్నాడట ప్రభాస్. ఈ సినిమా 2021లోనే విడుదలవుతుంది. ఇక ఆది పురుష్ కు కేవలం 60 రోజుల కాల్ షీట్స్ మాత్రమే ఇచ్చినట్లు సమాచారం. ఆది పురుష్ కి పోస్ట్ ప్రొడక్షన్ కు ఎక్కువ సమయం పడుతుంది. ఇక ఈ సినిమాలు అన్నీ అయ్యాక నాగ్ అశ్విన్ చిత్రాన్ని చేయనున్నాడు ప్రభాస్.