వంట రాదు.. భర్త వండితే తిని పెడతా.. ఓపెన్ అయిన హీరోయిన్

అగ్ర హీరోల పక్కన హీరోయిన్ గా నటించి.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్న డస్కీ బ్యూటీ ప్రియమణి. అటు గ్లామర్.. ఇటు గ్రామర్ పాత్రలకు సూట్ అయ్యే కంటెంట్ ఆమె సొంతం. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో రీఎంట్రీ ఇచ్చిన ఆమె.. అందరి మనసుల్ని దోచేశారు. డిజిటల్ ప్లాట్ ఫాం ఆహా కోసం మరోసారి వెబ్ సిరీస్ లో తళుక్కుమన్నారు. ‘భామాకలాపం’ పేరుతో రానున్న ఈ సిరీస్ లోఆమె అనుపమ పాత్రలో చెఫ్ గా కీ రోల్ ప్లే చేశారు. త్వరలో స్ట్రీమింగ్ కానున్న ఈ వెబ్ సిరీస్ నేపథ్యంలో మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా తన వ్యక్తిగతానికి సంబంధించి ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. భామాకలాపంలో తాను నటించిన పాత్రకు.. రియల్ లైఫ్ కు ఏ మాత్రం పోలిక లేదని.. చెఫ్ గా నటించిన తనకు అస్సలు వంటే రాదన్నారు. తన భర్త ముస్తఫా రాజ్ వండి పెడితే తినిపెడతానంటూ అసలు విషయాన్ని చెప్పేశారు. తనకు ఇంటి పట్టున ఉండటమే ఇష్టమని.. పని ఉంటేనే బయటకు అడుగు పెడతానని.. లేదంటే ఇంటికే పరిమితమవుతానని చెప్పారు.

తాను నటించిన భామా కలాపంలోని అనుపమ పాత్ర మాత్రం రియల్ లైఫ్ లో అస్సలు ఉండాలని కోరుకోనని స్పష్టం చేశారు. ఒక మహిళ తన కుటుంబానికి.. కట్టుకున్న భర్తకు జవాబుదారీగా ఉంటే చాలని.. ప్రపంచానికి అవసరం లేదని చెప్పిన ప్రియమణి.. అర్థం లేని వివాదాల గురించి తాను లైట్ తీసుకుంటానని చెప్పింది. తనను ఏదైనా వివాదంలో పడేసినా.. విమర్శల బారిన పడేసినా.. తాను కామ్ గా ఉంటానని చెప్పుకొచ్చారు.

తనకు సంబంధించిన చర్చ గురించి తాను మాట్లాడనని.. అలా చేస్తే అగ్నికి ఆజ్యంపోసినట్లేనని చెప్పారు. ఒక చెవితో విని.. మరో చెవితో వదిలేస్తానని.. ఈ రోజు కాకుంటే ఇంకో రోజైనా విమర్శలు కనుమరుగవుతాయని.. అదే వాటి గురించి స్పందిస్తే జనాల మధ్య నానుతూనే ఉంటామన్నారు. ప్రియమణి మాటలు వింటే ప్రాక్టికల్ గా ఎలా బతకాలన్న విషయంపై ఆమె ఎంతో క్లారిటీతో ఉన్నట్లుగా అర్థం కాక మానదు.