రాజద్రోహం కేసులో అరెస్టయిన నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకి ఇటీవల సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసినా, అనారోగ్య సమస్యల కారణంగా ఆర్మీ ఆసుపత్రి నుంచి ఆయన డిశ్చార్జి అవడం కాస్త ఆలస్యమైన సంగతి తెలిసిందే. ఇక, ఈరోజు రఘురామ, ఆర్మీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అవడంతోనే సరాసరి హస్తిన విమానమెక్కేశారు.. అదీ ప్రత్యేక విమానం కావడం గమనార్హం.
తన ఆరోగ్య పరిస్థితిపై ఆర్మీ ఆసుపత్రి ‘కమాండర్’కి రఘురామ ఓ లేఖ రాయడం, ఆ లేఖలో రఘురామ అభ్యర్థన మేరకే, ఆర్మీ ఆసుపత్రి ఆయన్ని డిశ్చార్జి చేయడం జరిగిందన్నది ఓ ఊహాగానం. కాగా, రఘురామ ఢిల్లీ వెళ్ళడం వెనుక, మెరుగైన వైద్య చికిత్స కోసమేనని ఆయన సన్నిహితుల నుంచి అందుతున్న సమాచారం తాలూకు సారాంశం. మరోపక్క, ఢిల్లీ ‘ఎయిమ్స్’ రఘురామ చేరడంపై రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయి. ఢిల్లీకి వెళ్ళిన రఘురామ, ఇకపై అక్కడి నుంచి చక్రం తిప్పబోతున్నారన్నది ప్రముఖంగా వినిపిస్తోన్న మరో వాదన.
బీజేపీ పెద్దలతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. ఇలా కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని నేరుగా కలిసే అవకాశం రఘురామకు వుంటుంది. దాంతో, ఆయన ఢిల్లీలో అతి త్వరలో ఆయా ప్రముఖులతో వరుస భేటీలు నిర్వహించవచ్చంటూ ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
ఇటీవల రఘురామ గుండెకు శస్త్ర చికిత్స జరిగిన దరిమిలా, ‘ఎయిమ్స్’లో ఆయన కొన్ని వైద్య పరీక్షలు చేయించుకోనున్నారనీ, పూర్తిగా ఆరోగ్యం కుదుటపడ్డాకనే ఆయన మళ్ళీ రాజకీయ రంగంలోకి దూకడం జరుగుతుందనే వాదన కూడా బలంగానే వినిపిస్తోంది.
ప్రస్తుతానికైతే రఘురామ మీడియాతో మాట్లడటానికి లేదు. సోషల్ మీడియా వేదికగా కూడా ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వడానికి అవకాశం లేదని సర్వోన్నత న్యాయస్థానమే స్పష్టం చేసింది. దాంతో, రఘురామ.. ఆ షరతుల నుంచి వెసులుబాటు వచ్చేవరకు, తెరవెనుక కార్యకలాపాలు మాత్రమే చక్కబెట్టుకోవాల్సి వుంటుంది. ఈలోగా తన ఆరోగ్యం కుదుటపటడానికి తగు జాగ్రత్తలు ఆయన తీసుకోవడం తప్పనిసరి.