ఏపీ సీఐడీ, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేసి, హైద్రాబాద్ నుంచి ఆంధ్రపదేశ్ తీసుకెళ్ళింది. కోర్టు ఆదేశాలతో నిన్నమెజిస్ట్రేట్ ముందు ఆయన్ని హాజరు పరచలేకపోయారు. ఇటీవల బైపాస్ సర్జరీ జరిగిన దరిమిలా, అవసరమైన మందుల్ని అందించడంతోపాటు, ఇతరత్రా సౌకర్యాలూ ఆయనకు అధికారులు కల్పించాలని హైకోర్టు ఆదేశించినట్లుగా తెలుస్తోంది. ఇంకోపక్క, రఘురామను ఏపీ సీఐడీ నిన్న రాత్రి ప్రశ్నించిందట.. ఈ రోజు ఉదయం కూడా ప్రశ్నిస్తోందట. ఈ విషయాన్ని వైసీపీ అనుకూల మీడియానే పేర్కొంటోంది.
పైగా, ఆ ప్రశ్నలేంటో కూడా వైసీపీ అనుకూల మీడియానే వెలుగులోకి తెచ్చేసింది.. అక్కడికేదో ఏపీ సీఐడీ, కేవలం అధికార పార్టీకి చెందిన అనుకూల మీడియాకే ఆ ప్రశ్నల్నిపంపినట్టుగా వుంది పరిస్థితి. ఎవరి ప్రోద్భలంతో, ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేలా విమర్శలు చేశారు.? సమాజంలో అలజడి రేపేందుకు ప్రయత్నించడం వెనుక మిమ్మల్ని ప్రోత్సహించిందెవరు.? సాంకేతిక సాయం అందించినవారెవరు.? అంటూ ప్రశ్నలు గుప్పించారట ఏపీ సీఐడీ పోలీసులు. ఈ మొత్తం సమాచారాన్ని వైసీపీ అనుకూల మీడియా ఊహించి, జనం ముందుంచింది తమ తమ మీడియా సాధనాల ద్వారా (పత్రిక, ఛానల్). కొంత సమాచారాన్ని కూడా ఏపీ సీఐడీ రఘురామ నుంచి రాబట్టిందట. నిజమేనా.? నిజమే అయితే, ఆ వివరాలన్నిటినీ కోర్టు ముందుంచుతుంది ఏపీ సీఐడీ. అయితే, ఇలాంటి విషయాల్లో లీకులకు ఆస్కారం వుండకూడదు.
మీడియాలో ఊహాజనిత కథనాలొస్తోంటే, మామూలుగా అయితే విచారణ సంస్థలు సూచనలాంటి హెచ్చరికలు చేస్తుంటాయి. అలాంటి సూచనలో, హెచ్చరికలో అధికార పార్టీ అనుకూల మీడియాకి వుంటాయా.? వుండవా.? అనే ప్రశ్న కొందరిలో వ్యక్తమవుతోంది.. నెటిజన్లు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఏదిఏమైనా, కరోనా విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం.. ఈ అరెస్టుతో ప్రస్తుతానికి సైడ్ ట్రాక్ అయ్యిందన్నది రాజకీయ విశ్లేషకుల వాదన.