రాజమౌళికి ఎన్టీఆర్ పై ఆ మాత్రం ఉండటం సహజమే!

రాజమౌళి ఎక్కడ ఏ ఫంక్షన్లో మాట్లాడినా ఏదో ఒక రకంగా ఎన్టీఆర్ ప్రస్తావన వస్తూనే ఉంటుంది. ఎన్టీఆర్ గురించి రాజమౌళి కూడా చాలా గొప్పగా చెబుతుంటారు. ఒక పాత్రకు న్యాయం చేయడానికి ఎన్టీఆర్ పడే ఆరాటం .. తాపత్రయం గురించి ఆయన చాలా సందర్భాల్లో చెప్పారు. అలాగే ఏ పాత్రను ఇచ్చినా ఆయన చాలా కాన్ఫిడెంట్ గా చేస్తాడనీ ఆయనలో తనకి నచ్చేది అదేనని అంటూ ఉంటారు. ‘రాధేశ్యామ్’ ప్రమోషన్స్ లో భాగంగా ఆయన ప్రభాస్ ను ఇంటర్వ్యూ చేసే సమయంలో కూడా ఎన్టీఆర్ ప్రస్తావన వచ్చింది. తనకంటే రాజమౌళికి తారక్ .. చరణ్ అంటే ఇష్టమనే విషయం అర్థమైందని ప్రభాస్ సరదాగా అన్నాడు.

తారక్ తో మీరు ‘యమదొంగ’ సినిమా చేసేటప్పుడు కూడా నేను మీతో మాట్లాడాను. అప్పుడు కూడా మీరు తారక్ కోసం రెడీగా ఉన్నాయంటూ రెండు మూడు కథలు చెప్పేవారు. మళ్లీ తారక్ తో చేయబోయే కథ ఇదేనని అనేవారు. దాంతో మళ్లీ మనకి ఛాన్స్ ఎప్పుడు వస్తుందబ్బా అని నేను ఆలోచనలో పడిపోయి లెక్కలు వేసుకునే వాడిని అని ప్రభాస్ అన్నాడు.

తాను ఒక సినిమా చేస్తున్నప్పుడు ఆ సినిమా హీరోకంటే తనకి ఎవరూ ఎక్కువకాదని రాజమౌళి చెప్పారు. కానీ ఆయనకి ఎన్టీఆర్ పై ఎక్కువ ఎఫెక్షన్ ఉంటుందని చెప్పుకునేవారు ఎక్కువే.

ఎన్టీఆర్ తో ఒక సీన్ చేసి ‘బాగా చేశావ్ తారక్’ అని నేను అనేలోగానే ‘దుమ్మురేపేశానుగదా’ అనేస్తాడు. ఆయనపై ఆయనకి గల నమ్మకానికి నాకు ఆశ్చర్యం వేస్తుంది. దర్శకుడిపైకంటే కూడా తనపై తనకి గల నమ్మకానికి నాకు ముచ్చట వేస్తుందనికూడా చెబుతుంటారు.’ఆర్ ఆర్ ఆర్’ ఈవెంట్స్ లోను ఆయన ఇదే మాటను చెప్పుకొచ్చారు కూడా. అందరూ అనుకునేది ఏదైనా రాజమౌళి కెరియర్ ఎన్టీఆర్ సినిమా ‘స్టూడెంట్ నెంబర్ 1’తోనే మొదలైంది. అందువలన ఎన్టీఆర్ పై రాజమౌళికి ఒక ప్రత్యేకమైన అభిమానం ఉండొచ్చు.

రాజమౌళి తన కెరియర్ ను మొదలుపెట్టిన తరువాత ఇచ్చిన మొదటి 6 హిట్లలో మూడు హిట్లు ఎన్టీఆర్ తో కనిపిస్తాయి. ఆ జాబితాలో ‘స్టూడెంట్ నెంబర్ 1’తో పాటు ‘సింహాద్రి’ .. ‘యమదొంగ’ కూడా ఉంటాయి. కెరియర్ తొలినాళ్లలో కలిసి వరుస సినిమాలు చేయడం .. అవి బ్లాక్ బస్టర్ హిట్లు కావడం వలన సహజంగానే వాళ్లిద్దరి మధ్య సాన్నిహిత్యం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది.

అందువల్లనే జక్కన్న .. జక్కన్న అంటూ ఎన్టీఆర్ మిగతా హీరోలకంటే కాస్త ఎక్కువ చనువుతో రాజమౌళితో ఉంటాడు. రాజమౌళి నుంచి ఎన్టీఆర్ కి కాస్త ఎక్కువ ప్రశంసలు వెళ్లినా తన సినిమా చేసే హీరోలందరినీ తన కుటుంబ సభ్యులమాదిరిగానే రాజమౌళి అభిమానిస్తుంటారు .. ప్రేమిస్తుంటారనే విషయం అందరికీ తెలిసిందే.