కొత్త రాజకీయ పార్టీని ప్రకటించబోతున్నానంటూ హడావిడి చేసిన రజనీకాంత్, అనూహ్యంగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి, రాజకీయ ఆలోచనల్ని విరమించుకున్నారు. రజనీకాంత్ తర్వాత శశికళ కూడా అంతే హడావిడి చేశారు. ఆసుపత్రిలో చేరారు, ఆ తర్వాత బయటకొచ్చి.. హంగామా చేసినా, చివరికి ఆమె కూడా రాజకీయ ఆలోచనల్ని పక్కన పెట్టాల్సి వచ్చింది.
చిత్రమేంటంటే రజనీకాంత్, శశికళ.. ఇద్దర్నీ భారతీయ జనతా పార్టీ ‘మేనేజ్’ చేసింది. ప్రస్తుతం తమిళనాడులో అధికారంలో వున్న అన్నాడీఎంకే పార్టీని బీజేపీ తన చెప్పుచేతల్లో పెట్టుకున్నవిషయం విదితమే. తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీ తిరిగి అధికారంలోకి రావాలి. ఈ క్రమంలో తాము కూడా కొన్ని సీట్లు సంపాదించుకోవాలి. ఇదీ బీజేపీ వ్యూహం. గెలిచాక, అన్నాడీఎంకేని ఎలా అదుపు చేయాలి.? ఎలా దాన్ని దెబ్బకొట్టి, తమిళనాడులో అధికారం దక్కించుకోవాలి.? అన్న విషయాలపై బీజేపీకి పూర్తిస్థాయి స్పష్టత వుంది.
రజనీకాంత్ పార్టీ అయినా, శశికళ పార్టీ అయినా.. అన్నాడీఎంకేని దెబ్బకొట్టేవే. దాంతో, ఆ అవకాశం ఆ ఇద్దరికీ ఇవ్వకుండా జాగ్రత్తపడింది బీజేపీ. నిజానికి, రజనీకాంత్ పొలిటికల్ పార్టీ హంగామా నడుస్తున్న సమయంలోనే, బీజేపీ అతన్ని కంట్రోల్ చేసి తీరుతుందని పెద్దయెత్తున బెట్టింగ్స్ నడిచాయి తమిళనాడులో. ‘మా తలైవా.. తగ్గేదే లేదు..’ అని రజనీకాంత్ అభిమానులు అనుకున్నారుగానీ, ‘అనారోగ్యం సాకు’ చూపి, ఆయన బీజేపీ చెప్పుచేతల్లోకి వెళ్ళిపోయి, రాజకీయ పార్టీ పెట్టాలన్న ఆలోచనను పక్కన పెట్టేశారు.
చిన్నమ్మ శశికళ కూడా అంతే. ‘గతంలోనూ నేను రాజకీయాలు చేయలేదు, ఇకపైనా రాజకీయాలు చేయదలచుకోలేదు..’ అంటూ చిత్ర విచిత్రమైన ప్రకటన చేశారు శశికళ. ఈ మాత్రందానికి పెద్ద పెద్ద రోడ్ షోలు ఎందుకు చేసినట్లు.? అన్నాడీఎంకే నేతల్లో కొందరిని కొనుగోలు చేయడమెందుకు.? అన్నట్టు కమల్ హాసన్, శరత్ కుమార్ తదితరులు మాత్రం ప్రస్తుతానికి తమ తమ రాజకీయ పార్టీలతో కాస్త గట్టిగానే నిలబడుతున్నారు. అయితే, వీళ్ళకి తమిళనాడులో రాజకీయంగా వున్న పాపులారిటీ అంతంతమాత్రమే. ఏమాత్రం పాపులారిటీ వున్నా, బీజేపీ.. వీళ్ళని కూడా వదిలే సమస్యే లేదు. బీజేపీ రాజకీయమే అంత.
Share