తమిళుల తలరాతను తలైవా మార్చేనా?

రాజకీయ ప్రవేశంపై ఎన్నో ఏళ్లుగా ఊరిస్తూ ఊరిస్తూ వచ్చిన సూపర్ స్టార్ రజనీకాంత్ వచ్చే ఏడాది జనవరిలో కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించడంతో తమిళనాట రాజకీయాలు వేడెక్కాయి. తమిళుల తలరాతను మార్చడానికే తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు రజనీ ప్రకటించారు. ఎనిమిది నెలల్లో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సరైన సమయంలోనే రజనీ నిర్ణయం వెలువడిందని అంటున్నారు. అయితే, తమిళనాడు కీలక నేతలైన పురచ్చితలైవి జయలలిత, కళైంగర్ కరుణానిధి లేని లోటును రజనీ భర్తీ చేయగలరా లేదా అనే విషయంపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. తమిళనాడు రాజకీయాల్లో సినీతారల నేపథ్యం కొత్తేమీ కాదు. అన్నాదురై, ఎంజీఆర్, జయలలిత, కరుణానిధిలకు సినీ నేపథ్యం ఉంది. వారంతా తమిళనాట రాజకీయాలను ఏళ్ల పాటు శాసించారు.

జయలలిత, కరుణానిధి మృతిచెందడంతో వారి లోటును భర్తీ చేసే నేతలెవరూ తమిళనాడులో లేకపోవడం రజనీకి కాస్త కలిసి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం డీఎంకే అధినేత స్టాలిన్ ఒక్కరే పేరున్న నేతగా ఉన్నారు. అయితే, ఆయన సోదరుడు అళగిరి వేరు కుంపటి పెట్టుకోవడం స్టాలిన్ కు ఎంతోకొంత నష్టం కలిగించే అవకాశం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇక అన్నాడీఎంకేలో పళని స్వామి, పన్నీర్ సెల్వంలు వర్గపోరుతో కొట్టుమిట్టాడుతున్నారు. ఆ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపగలదనే విషయంలో ఇప్పటికే పలువురికి సందేహాలున్నాయి. ఇలాంటి సమయంలో రజనీ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం కరెక్టేనంటున్నారు. అయితే, ఏమాత్రం రాజకీయ అనుభవం లేని తలైవా.. ఎలాంటి అజెండాతో ప్రజల్లోకి వెళ్లి వారి ఆదరాభిమానాలు సంపాదిస్తారనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయనకు లక్షలాది మంది అభిమానుల బలం ఉన్నా.. సీఎం పీఠం అందుకునేందుకు తగిన వ్యూహాలు రచించగలరా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

తాము ఆధ్యాత్మికతతో కూడిన లౌకిక రాజకీయాలు చేస్తామన్న రజనీ ప్రకటనను డీఎంకే ఇప్పటికే తిప్పికొట్టింది. అదే సమయంలో రజనీ తమిళేతరుడు అనే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. కర్ణాటకలోని మరాఠా కుటుంబంలో పుట్టిన రజనీ.. తమిళనాడును ఏలడమేమిటంటూ ఆయన ప్రత్యర్థులు అప్పుడే ప్రశ్నలు సంధిస్తున్నారు. మరోవైపు డీఎంకే ఓట్లను చీల్చడానికి బీజేపీ తెర వెనుక ఉండి ఆ డ్రామా ఆడిస్తోందనే ఆరోపణలూ వెల్లువెత్తుతున్నాయి. వీటన్నింటికీ రజనీ సరైన సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. అదే సమయంలో ఈ ఎనిమిది నెలల కాలంలో ఆయన ప్రజల్లోకి ఎంత మేర వెళ్లగలరనే అంశంపైనే రజనీ రాజకీయ విజయం ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే పలు అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న తలైవా.. తమిళనాడు అంతా తిరిగి దూకుడుగా ప్రచారం చేయగలరా లేదా అనేది చర్చనీయాంశమైంది.

సీఎం పీఠాన్ని రజనీ అందుకోగలరా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే.. తమిళ రాజకీయాలను ప్రభావితం చేయడం మాత్రం ఖాయమని అంటున్నారు. పార్టీ అజెండా ఖరారయ్యాక, ఆయన అనుసరించే వ్యూహ ప్రతివ్యూహాలను బట్టి రజనీ విజయం ఆధారపడి ఉటుందని చెబుతున్నారు.