‘ఖైదీ’ డైరెక్టర్ తో చెర్రీ మైత్రీ కుదురుతోందా..?

కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ వరుస విజయాలతో జోరు మీదున్నాడు. ‘మా నగరం’ సినిమాతో టాలీవుడ్ దృష్టిలో పడ్డ లోకేష్.. ‘ఖైదీ’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రంతో సూపర్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ క్రమంలో విజయ్ – విజయ్ సేతుపతి లతో ‘మాస్టర్’ సినిమా తీసి మరో సూపర్ హిట్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం లోకనాయకుడు కమల్ హాసన్ తో ‘విక్రమ్’ అనే క్రైమ్ థ్రిల్లర్ తెరకెక్కిస్తున్నాడు లోకేష్. తెలుగులో కూడా యువ దర్శకుడికి మంచి క్రేజ్ ఉండటంతో పలువురు టాలీవుడ్ స్టార్ హీరోలు ఆయనతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా లోకేష్ కనగరాజుతో ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యారని టాక్ వినిపిస్తోంది.

టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన రామ్ చరణ్.. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. తెలుగు తమిళ భాషల్లో ‘చరణ్ – లోకేష్’ చిత్రాన్ని రూపొందించడానికి మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ ప్లాన్ చేస్తోందని ఫిలిం సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. ఇప్పటికే మైత్రీ వారు డైరెక్టర్ లోకేష్ కు రూ.5 కోట్ల వరకు ముట్టజెప్పి ఒప్పందం కుదుర్చుకున్నారని ప్రచారం జరుగుతోంది. మరి ‘ఖైదీ’ డైరెక్టర్ తో చెర్రీ మైత్రీ కుదిరిందా లేదా అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. ఇకపోతే చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంలో నటిస్తున్నారు. అలానే కొరటాల శివ డైరెక్షన్ లో తన తండ్రి చిరంజీవి తో కలసి ‘ఆచార్య’ సినిమా చేస్తున్నాడు. ఇదే క్రమంలో శంకర్ తో చరణ్ ఓ పాన్ ఇండియా మూవీ అనౌన్స్ చేశాడు.