యంగ్‌ డైరెక్టర్‌కు ఓకే చెప్పిన రామ్‌ చరణ్‌

యంగ్‌ స్టార్‌ హీరో రామ్‌ చరణ్‌ తదుపరి సినిమా విషయంలో చాలా రకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. భారీ ఎత్తున అంచనాలున్న ఆర్ఆర్‌ఆర్‌ సినిమా షూటింగ్‌ లో చరణ్‌ పాల్గొంటున్నాడు. ఆ తర్వాత ఆచార్య సినిమాను చిరంజీవితో కలిసి చరణ్‌ చేయబోతున్నాడు. ఆచార్య సినిమాలో చరణ్‌ పాత్ర గెస్ట్‌ రోల్‌ కంటే కాస్త ఎక్కువే ఉంటుందని అంటున్నారు. మరో వైపు రామ్‌ చరణ్‌ సినిమా షూటింగ్‌ లు రెండు ముగింపు దశకు వస్తున్న నేపథ్యంలో తర్వాత సినిమా ఏంటీ అనేది చర్చనీయాంశంగా ఉంది.

మోహన్ రాజా దర్శకత్వంలో చరణ్‌ మూవీ ఉంటుందని వార్తలు వచ్చాయి. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చరణ్‌ హీరోగా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో సినిమా రాబోతుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. జెర్సీ సినిమాతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు ట్యాలెంటెడ్‌ డైరెక్టర్ గా పేరు దక్కించుకున్న గౌతమ్‌ కు చరణ్‌ డేట్లు ఇచ్చాడని తెలుస్తోంది. ఎన్వీ ప్రసాద్‌ ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. త్వరలోనే ఈ విషయమై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.