దర్శకుడు శంకర్ సినిమా అంటే భారీ తనంకు పెట్టింది పేరు అనడంలో సందేహం లేదు. పెద్ద ఎత్తున ఈయన సినిమాలు భారీ బడ్జెట్ తో రూపొందుతుంటాయి. శంకర్ సినిమాలో ఒక్క పాటతో మీడియం రేంజ్ సినిమాను నిర్మించే అవకాశం ఉంటుంది. మరో వైపు దిల్ రాజు బడ్జెట్ విషయంలో కాస్త పిసినారిగా వ్యవహరిస్తూ ఉంటాడు. అలాంటిది వీరిద్దరి మద్య ఎలా ఈ సినిమా కుదిరిందని అంతా కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. దిల్ రాజు ఈ సినిమా బడ్జెట్ విషయంలో ముందే ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా తెలుస్తోంది.
కథ చెప్పిన సమయంలోనే దర్శకుడు శంకర్ బడ్జెట్ చెప్పాడట. ఆ బడ్జెట్ కంటే అయిదు కోట్లు అదనంగా ఖర్చు అయినా పర్వాలేదు కాని అంతకు మించి మాత్రం ఖర్చు పెట్టవద్దంటూ ముందస్తుగానే శంకర్ తో దిల్ రాజు ఒప్పందం చేసుకున్నట్లుగా సమాచారం అందుతోంది. శంకర్ అడిగిన బడ్జెట్ కు ఓకే అంటూనే అంతకు మించి బడ్జెట్ కేటాయిస్తే పారితోషికం నుండి కట్ చేయాల్సి ఉంటుందని ఇప్పటికే ఇద్దరు కూడ ఆ ఒప్పందం చేసుకున్నట్లుగా సమాచారం అందుతోంది. 2.ఓ మరియు ఇండియన్ 2 సినిమాలు బడ్జెట్ విషయంలో పరిధి దాటాయి. అందుకే దిల్ రాజు ముందస్తు వ్యూహంతో ఇలా ఒప్పందం చేసుకున్నారు.