కన్నడ ముద్దుగుమ్మ రష్మిక మందన్నా తెలుగులో టాప్ స్టార్ హీరోయిన్ గా దూసుకు పోతుంది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో చేస్తున్న సినిమాలతో పాటు తమిళం.. కన్నడం మరియు హిందీ సినిమాల్లో కూడా నటిస్తుంది. హిందీలో ఈమె మిషన్ మజ్ను సినిమాతో పరిచయం కాబోతుంది. ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ సినిమా తర్వాత రష్మిక చేయబోతున్న సినిమాపై క్లారిటీ వచ్చింది.
మొన్నటి వరకు అమితాబచ్చన్ నటిస్తున్న గుడ్ బై సినిమాలో రష్మిక ఆయన కూతురు పాత్రలో కనిపించబోతున్నట్లుగా ప్రచారం జరిగింది. తాజాగా ఆ విషయమై క్లారిటీని స్వయంగా రష్మిక ఇచ్చింది. ఔను నేను అమితాబచ్చన్ సినిమాలో నటిస్తున్నాను ఆ సినిమా పూజా కార్యక్రమాలు పూర్తి అయ్యాయి అన్నట్లుగా క్లాప్ బోర్డ్ ఫొటోను పోస్ట్ చేసింది. ఏక్తా కపూర్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అతి త్వరలోనే ప్రారంభం కాబోతుంది. ఈ చిత్రం కు సంబంధించిన షూటింగ్ కోసం రష్మిక చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుందట.