RRR గుజరాత్ చేతిలో ఓడిందా? స్పందించిన కేటీఆర్

‘ఆర్ఆర్ఆర్’ చిత్రం భారత్ నుంచి ఆస్కార్ ఎంట్రీని కోల్పోవడంపై దేశవ్యాప్తంగా చాలా చర్చలు జరుగుతున్నాయి. గుజరాతీ చిత్రం ‘ఛలో షో’ని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆస్కార్ కు నాినేట్ చేసి ‘RRR’ సినిమాను పక్కనపెట్టేసింది. ఆర్ఆర్ఆర్ సినిమా స్థానాన్ని ఒక ఎవరికి తెలియని గుజరాత్ సినిమా కైవసం చేసుకోవడం చూసి చాలా మంది సినీ ప్రియులు మరియు ఔత్సాహికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

‘ఆర్ఆర్ఆర్’తో గుజరాత్కు ఓటమి తప్పదని రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు విశ్లేషించారు. నాగేశ్వరరావు తన సోషల్ మీడియా ఖాతాలో ఈ మేరకు విశ్లేషించాడు. తెలంగాణ/హైదరాబాద్లో ఏర్పాటు చేయాల్సిన ప్రాజెక్టులను మోడీ-షాల తమ సొంత రాష్ట్రం గుజరాత్ కు తరలించారని ఆ జాబితాను ప్రస్తావించారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ నుండి ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ వరకు రెండు ముఖ్యమైన ప్రాజెక్టులు చివరి నిమిషంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సొంత రాష్ట్రానికి మార్చబడ్డాయని ఆరోపించారు.

ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసిన ఈ ట్వీట్ను గమనించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్… ‘గుజరాత్కు తెలంగాణ నుంచి తరలించిన ఈ ప్రాజెక్టులపై పెదవి విప్పని తెలంగాణ బీజేపీ నేతలపై మండిపడ్డారు. “తెలంగాణకు చెందిన ఏ ఒక్క బీజేపీ జోకర్కి కూడా తెలంగాణ ప్రాజెక్టులు గుజరాత్ కు తరలివెళ్లడంపై ఏది న్యాయమని డిమాండ్ చేసే దమ్ము లేదు. తమ గుజరాతీ బాస్ల చప్పుళ్లను మోయడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. కానీ తెలంగాణ హక్కులను డిమాండ్ చేసే ధైర్యం చేయలేకపోతున్నాం” అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

ప్రాజెక్టులను దారి మళ్లించడంలో ప్రధాని మోదీ ప్రభావవంతమైన పాత్ర పోషిస్తున్నారని ఐటీ మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. మోడివర్స్కు కేంద్రం గుజరాత్ అని కేటీఆర్ అన్నారు.

తెలంగాణ మాత్రమే కాదు మహారాష్ట్ర కూడా ఇలానే అన్యాయం అవుతోంది. ఆ రాష్ట్రం నుంచి గుజరాత్కు కీలకమైన పెట్టుబడి ప్రాజెక్టులను కోల్పోతోంది. ఇటీవలే సెమీకండక్టర్స్ ప్లాంట్ మరియు ఫాక్స్కాన్ డీల్ గుజరాత్కు మారడంతో మహారాష్ట్ర విపక్షాల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది.

ఇలా మోడీ సర్కార్ లో ఇతర రాష్ట్రాలకు రావాల్సిన అన్ని ప్రాజెక్టులు సొంత రాష్ట్రానికి తరలించుకుపోవడం వివాదాస్పదమవుతోంది. ఆఖరుకు ఆర్ఆర్ఆర్ సినిమా కూడా పక్కనపెట్టి గుజరాత్ సినిమాను ఆస్కార్ కు పంపడంపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.