జపాన్ లోనూ RRR దుమారం తధ్యమేనా!


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-యంగ్ టైగర్ ఎన్టీఆర్-రాజమౌళి కాంబినేషన్ లో రిలీజ్ అయిన `ఆర్ ఆర్ ఆర్ `పాన్ ఇండియా సంచలనం గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన చిత్రంగా నిలిచింది. 1100 కోట్ల వసూళ్లతో భారతీయ సినిమా వసూళ్లలో మూడవ స్థానంలో నిలిచింది. అమెరికాలో హిందీ వెర్షన్ ఏకంగా రీ రిలీజ్ సైతం జరిగింది.

ఈ రిలీజ్ తో `ఆర్ ఆర్ ఆర్` హాలీవుడ్ మేకర్లకి దగ్గరైంది. ఇక ఓటీటీ రిలీజ్ తో `ఆర్ ఆర్ ఆర్` రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. హాలీవుడ్ సైతం మెచ్చిన చిత్రంగా నిలిచింది. అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించిన రామ్ చరణ్ కి ఏకంగా హాలీవుడ్ అవకాశాలే తలుపుతట్టాయి. ఇది నిజంగా ఓ టాలీవుడ్ సినిమాకి ఊహించని ఓటీటీ సక్సెస్ గా చెప్పొచ్చు.

ఇక తారక్ ఇంటర్వెల్ బ్యాంగ్ సీన్ కి గ్లోబల్ స్థాయిలో ప్రత్యేకమైన గుర్తింపు దక్కిందని వ్యూస్ చూస్తేనే తెలుస్తోంది. హాలీవుడ్ కి ఈ రేంజ్ లో రీచ్ అవుతుందని టీమ్ సైతం అంచనా వేయలేకపోయింది. మరి ఇప్పుడీ క్రేజ్ తో జక్కన్న ఇంకా అద్భుతాలు చేయాలనుకుంటున్నారా? అంటే అవుననే అనిపిస్తుంది.

ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న రాజమౌళి ఒక్కసారిగా ఉప్పెనల గ్లోబల్ మార్కెట్ పై విరుచుకు పడటానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

జపాన్ లో చిత్రాన్ని భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి సర్వం సిద్దం చేస్తున్నారు. అక్టోబర్ 21-2022లో చిత్రాన్ని జపాన్ లో భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అందుకు కారణం లేకపోలేదు. జక్కన్న జపాన్ లో ఓ బ్రాండ్ గా మారిపోయారు. `బాహుబలి` రెండు భాగాలు జపాన్ లో రిలీజ్ చేసి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

జపాన్ లో సైతం `బాహుబలి` భారీ వసూళ్లని సాధించిన చిత్రం గా నిలించింది. అంతేకాదు ఆ సినిమాతో ప్రభాస్ కి..రాజమౌళికి ప్ర త్యేకమైన అభిమానులు ఏర్పడ్డారు. డార్లింగ్ పుట్టిన రోజును జపనీయులు ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసారంటే? బాహుబలి ఎంతగా రీచ్ అయిందో అప్పుడే అద్దం పట్టింది. అందుకే మరోసారి జక్కన్న బ్రాండ్ తో `ఆర్ ఆర్ ఆర్` జపాన్ మార్కెట్ కి రెడీ అవుతోంది. మరి అక్కడ ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో చూద్దాం.