RRR: ‘డ్రమ్స్ ప్రాక్టీస్ అయిందా?’.. రామరాజుని ప్రశ్నిస్తున్న భీమ్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా మధ్యమాలలో ఖాతాలు కలిగి ఉన్నా.. పెద్దగా యాక్టీవ్ గా ఉండరనే సంగతి తెలిసిందే. ఏవైనా ప్రత్యేక సందర్భాల్లో సినీ ప్రముఖుల పుట్టినరోజులకు తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఇవ్వడానికి తప్ప తారక్ రెగ్యులర్ గా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో కనిపించడు. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి ఎన్టీఆర్ సోషల్ మీడియాలో యాక్టీవ్ అయ్యారు. ఈరోజు నుంచి కొన్ని రోజుల పాటు నందమూరి వారసుడు వరుస పోస్టులు పెట్టబోతున్నారు. ‘ఆర్ ఆర్ ఆర్’ షూట్ కు సంబంధించిన విషయాలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయనున్నాడు.

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంలో ఎన్టీఆర్ – రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న విషయం తెలిసిందే. యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ ను దసరా కానుకగా అక్టోబర్ 13న విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రంలోని ఫైనల్ సాంగ్ షూటింగ్ ఉక్రెయిన్ లో జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టిన జక్కన్న అండ్ టీమ్.. RRR ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ని కొన్ని రోజులపాటు ఎన్టీఆర్ స్వీకరిస్తున్నట్లు వెల్లడించింది.

ఉక్రెయిన్ లో RRR షూటింగ్ సంబంధించిన విషయాలని ఎన్టీఆర్ సోషల్ మీడియాలో షేర్ చేయనున్నారు. ఫోటోలు వీడియోలతో పాటుగా విరామ సమయంలో జరిగే ఫన్నీ ఇన్సిడెంట్స్ ని కూడా తారక్ ట్రిపుల్ ఆర్ ఇన్స్టాగ్రామ్ లో పంచుకోనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఎన్టీఆర్ ఫస్ట్ పోస్ట్ ని షేర్ చేశారు. తారక్ స్వయంగా తీసిన ఈ వీడియోలో రామ్ చరణ్ – రాజమౌళి తనయుడు కార్తికేయ సంభాషణ ఉంది. ‘చరణ్ డ్రమ్స్ ప్రాక్టీస్ అయిందా?’ అని ఎన్టీఆర్ అడుగగా.. టేబుల్ పై దరువేసిన చెర్రీ ‘అయిపోయింది’ అని వెటకారంగా చెప్పాడు. అంతేకాదు ‘డ్రమ్స్ ఏవి? కాస్ట్యూమ్స్ లేవు డ్రమ్స్ లేవు.. పొద్దు పొద్దునే తీసుకొచ్చి ఇక్కడ కూర్చో బెట్టారు. దసరా రిలీజ్ అంటూ అనౌన్స్ చేశారు..’ అంటూ కార్తికేయ ను చరణ్ ప్రశ్నిస్తున్నాడు. ఈ ఫన్నీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఏదేమైనా ‘ఆర్ ఆర్ ఆర్’ మూలంగా తమ అభిమాన హీరో ఎన్టీఆర్ ఇలా సోషల్ మీడియాలో యాక్టీవ్ అవడం.. స్వయంగా ఇలా స్నాప్స్ షేర్ చేయడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇకపోతే ఇంతకముందు ఎన్టీఆర్ – రాజమౌళి ఇద్దరూ ఉక్రెయిన్ లో మెడలో ఐడీ కార్డులు ధరించి ‘మేము ఐడీ కార్డు వేసుకుని చాలా సంవత్సరాలైంది. తొలిసారి సెట్స్ లో ఇలా’ అంటూ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. అలానే తారక్ – చరణ్ ఇద్దరూ ఓ పిట్ట గోడపై కూర్చొని ముచ్చట్లు పెడుతుండగా.. జక్కన్న ఆ సన్నివేశాన్ని కెమెరాలో బంధిస్తున్నట్లు ఓ సరదా వీడియోని చిత్ర బృందం షేర్ చేసిన విషయం తెలిసిందే. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ‘ఆర్ ఆర్ ఆర్’ బృందం ఇలా డిఫరెంట్ ప్రమోషనల్ స్ట్రాటజీలతో సినిమాపై జనాల్లో ఆసక్తిని రెట్టింపు చేస్తోంది.

కాగా RRR చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్.. కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఆలియా భట్ – ఒలివియా మోరిస్ హీరోయిన్ లుగా నటిస్తుండగా.. అజయ్ దేవ్ గణ్ – శ్రియ – సముద్ర ఖని తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. కె కె సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ.. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.