దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి `నాటు నాటు..` పాట అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటికే కోట్లాది మంది వీక్షణలతో నాటు నాటు సంచలనంగా మారింది. అయితే ఈ పాట ఇంత పెద్ద హిట్టవ్వడం వెనక పనితనం ఎవరిది? అన్నది ఆరా తీస్తే.. చాలా విషయాలు అర్థమవుతున్నాయి.
ఈ పాటకు ఎం.ఎం.కీరవాణి మాస్ బీట్ ని అందించగా.. ఆ దరువుకు తగ్గట్టుగానే ఎన్టీఆర్ – రామ్ చరణ్ ఇద్దరూ అద్భుతమైన నృత్య ప్రదర్శనతో అలరించారు. ముఖ్యంగా అత్యంత కాంప్లికేషన్ ఉన్న స్టెప్పుల్ని ఈ పాట కోసం కొరియోగ్రాఫర్లు కంపోజ్ చేయడం విశేషం. అయితే ఈ పాటలో నృత్యాలు అంత అద్భుతంగా కుదరాలంటే ఇద్దరు స్టార్ల నడుమా సింక్ బాగా కుదరాలి. దానికోసం ఏకంగా ఏడు రోజుల పాటు తారక్ – చరణ్ ప్రాక్టీస్ చేసారంటే అర్థం చేసుకోవాలి.
అసలు ఇండియాలోనే టాప్ డ్యాన్సర్లుగా గుర్తింపు ఉన్న ఇద్దరు హీరోలు వాస్తవానికి సెట్లో ప్రాక్టీస్ అవసరం లేకుండానే కేవలం కొరియోగ్రఫీ వీడియోలు చూసి డ్యాన్సులు చేసేస్తుంటారు. అలాంటిది నాటు నాటు పాట కోసం ఏడు రోజుల పాటు ప్రాక్టీస్ చేసి శ్రమించారంటే అర్థం చేసుకోవాలి. ప్రస్తుతం ఈ సాంగ్ కోసం చరణ్- తారక్ ఏ విధంగా ప్రిపేర్ అయ్యారనేదే ఫిల్మ్ నగర్ లో చర్చనీయాంశమైంది. నిజానికి హీరోలిద్దరూ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ డ్యాన్స్ స్టూడియోకి వారం రోజుల పాటు హాజరైనట్లు సమాచారం. ఇది స్టెప్పుల కంపోజింగ్ గురించి కాదు.. డ్యాన్స్ తో పాటు ఒకరితో ఒకరి టైమింగ్ సరిగా కుదరడం కోసం గ్రేస్ కోసం ఇంతగా ప్రాక్టీస్ చేశారట. వాస్తవానికి పాట సెట్స్కి వెళ్లడానికి ముందే గంటల తరబడి ప్రాక్టీస్ చేశారని అంటున్నారు. మొత్తానికి ఆ ఇద్దరి అంకితభావానికి హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేం. అంతగా ఈ పాట వర్కవుటైంది. నాటు నాటు సాంగ్ నేపథ్యం బ్రిటీష్ భామల మధ్య కథానాయకుల పనితనాన్ని డ్యాన్సింగ్ ప్రతిభను కూడా ఆవిష్కరిస్తోంది.