పరీక్షలు వాయిదా వేయాలంటూ సబితా ఇల్లు ముట్టడి

తెలంగాణలో డిగ్రీ, ఇంజనీరింగ్ పరీక్షలు వాయిదా వేయాలంటూ తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటిని విద్యార్థులు ముట్టడించారు. శ్రీసాయి నిగమాగమం నుండి ఆమె నివాసం వరకూ విద్యార్థులు ర్యాలీగా వెళ్లారు.

దాదాపు విద్యార్థులు అందరూ 18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉంటారని, అందరికీ రెండు డోస్ ల వ్యాక్సిన్ అవ్వలేదని, కాబట్టి పరీక్షలు వాయిదా వేయడమో, రద్దు చేయడమో చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.

అయితే ఇప్పటికిప్పుడు పరీక్షల వాయిదాపై నిర్ణయం తీసుకోలేమని సబితా అన్నారు. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో మంత్రి జోక్యం చేసుకుని పరిస్థితి సద్దుమణిగించే ప్రయత్నం చేసారు. విద్యార్థులు ఎక్కడ కోరితే అక్కడ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, అలాగే విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పరీక్ష నిర్వహిస్తామని సబితా అన్నారు.

ఈ విషయంలో స్పష్టమైన వైఖరి బయట పెట్టాలని కోరుకున్న విద్యార్థులు మంత్రి నివాసానికి సమీపంలో రోడ్డుపై బైఠాయించారు.