ఇండియాలో పే పర్ వ్యూ పద్దతిన సినిమాల విడుదలను రామ్ గోపాల్ వర్మ మొదలు పెట్టాడు. కాని ఆయన సినిమాల్లో ఎక్కువ శాతం నిరాశ పర్చాయి. కాని ఇటీవల రంజాన్ సందర్బంగా విడుదల అయిన సల్మాన్ ఖాన్ రాధే సినిమా మాత్రం మంచి వసూళ్లను రాబట్టింది. సినిమాకు నెగటివ్ టాక్ వచ్చినా కూడా మొదటి రోజే వంద కోట్లకు పైగానే వసూళ్లు నమోదు అయ్యాయి అంటూ యూనిట్ సభ్యులు ప్రకటించారు. జీ సంస్థ దక్కించుకున్న రాధే సినిమా వారికి మంచి లాభాలను తెచ్చి పెట్టింది. ఇప్పుడు రాధే సినిమా దారిలోనే మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ‘రిపబ్లిక్‘ మూవీ కూడా విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం రిపబ్లిక్ సినిమా థియేట్రికల్ రైట్స్ ను కూడా జీ సంస్థ కొనుగోలు చేసేందుకు సిద్దంగా ఉంది. ఇక చిత్ర యూనిట్ సభ్యులు ఒప్పుకుంటే ఓటీటీ మరియు పేపర్ వ్యూ పద్దతిన విడుదల చేసేందుకు గాను జీ సంస్థ రెడీగా ఉందట. కాని ఇప్పటి వరకు సాయి ధరమ్ తేజ్ నుండి మాత్రం స్పందన రావడం లేదు. ఆయన ఓకే అంటే నిర్మాతలు రిపబ్లిక్ ను జీ కి పేపర్ వ్యూ పద్దతిన రిలీజ్ చేసేందుకు ఇచ్చే అవకాశం ఉంది. అయితే తెలుగు ప్రేక్షకులు పే పర్ వ్యూ పద్దతిన ఎంత వరకు చూస్తారు అనేది అనుమానమే. ఈ ప్రయోగంకు ఎంత వరకు ప్రేక్షకుల మద్దతు ఉంటుంది అనేది చెప్పలేం. కనుక రిపబ్లిక్ సినిమా విడుదల విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది.