ప్రభాస్ ‘ఆదిపురుష్’ పై వివాదం రేగే అవకాశం ఉందా..?


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ స్ట్రెయిట్ బాలీవుడ్ సినిమా ”ఆదిపురుష్” ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఓం రౌత్ దర్శకత్వంలో 3డీ లో ఈ పాన్ ఇండియా మూవీ రూపొందనుంది. టీ-సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ – క్రిషన్ కుమార్ – ప్రసాద్ సుతార్ – రాజేష్ నాయర్ – ఓం రౌత్ కలిసి భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రాన్ని వివిధ భాషల్లో 2022 ఆగస్టు 11న విడుదల చేననున్నట్లు అధికారికంగా ప్రకటించారు. రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ ‘రాముడి’గా.. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడు పది తలల ‘లంకేష్’ గా నటించనున్నారు. అయితే ఇటీవల సైఫ్ అలీఖాన్ ఈ సినిమా గురించి వెల్లడించిన విషయాలతో ‘ఆదిపురుష్’ అనవసర వివాదాలను కొని తెచ్చుకునేలా ఉందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతోంది.

సైఫ్ అలీఖాన్ మాట్లాడుతూ.. ”రాక్షస ప్రభువు వంటి పాత్ర చేయటం ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇలాంటి పాత్రలు చాలా అరుదుగా ఉంటాయి. కానీ ఇందులో సీతని అపహరించినందుకు రామునితో రావణుడికి మధ్య యుద్ధానికి దారి తీసిన పరిస్థితులను.. తన చెల్లి శూర్పణఖ విషయంలో లక్ష్మణుడు చేసిన పనికి ప్రతీకారం తీసుకునేందుకు అతను చేసే ప్రయత్నాలు.. వీటన్నింటికీ న్యాయం చేస్తూ ఎంటర్టైనింగ్ గా మనిషిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు” అని రావణుడి పాత్ర గురించి చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడు సైఫ్ చెప్పిన విషయాలు ప్రభాస్ ని కాంట్రవర్సీలోకి లాగుతాయేమోనని డార్లింగ్ ఫ్యాన్స్ ఆలోచనలో పడ్డారు.

ఇతిహాస ‘రామాయణం’ ను మనదేశంలో ఎంతలా ఆరాధిస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అన్ని విషయాల్లో అయోధ్యను పాలించిన రాముడుని ఆదర్శంగా తీసుకుని ముందుకువెళ్తుంటారు. అయోధ్యలో రామమందిరం విషయంలో ఎన్నో ఏళ్లుగా జరిగిన వివాదం గురించి తెలిసిందే. రామాయణం ను ఎంతగా ఆరాధిస్తారో అని చెప్పడానికి ‘రామాయణం’ సీరియల్ ను ఈ లాక్ డౌన్ సమయంలో మూడు దశాబ్దాల తరవాత దూరదర్శన్ రీ-టెలీకాస్ట్ ఏకంగా 77 మిలియన్ల మంది వీక్షించారు. అలానే మణిరత్నం ‘రావణ్’ అనే టైటిల్ పెట్టి సినిమా తీస్తే అప్పట్లో నిరసనలు వ్యక్తం అయ్యాయి. ‘అవతార్’ లో పండోరాల గెటప్స్ రాముడిని పోలి ఉన్నాయని.. ఆ సినిమాని బ్యాన్ చేయాలని డిమాండ్ చేసినవారు కూడా లేకపోలేదు. అలాంటిది ఇప్పుడు ‘ఆదిపురుష్’ లో రావణుడిని మంచి మనిషిగా చూపిస్తే ఎక్కడో రాముడుని తక్కువ చేస్తున్నారనే అనే భావన వస్తుందేమో అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. కెరీర్ స్టార్టింగ్ నుంచి ప్రభాస్ ఎలాంటి వివాదాల జోలికి పోకుండా సినిమాలు చేసుకుంటున్నాడు. ఇప్పుడు అనవసరంగా కాంట్రవర్సీలోకి వస్తాడేమో అని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.