పెళ్లి అంటేనే విముఖత చూపించే సల్మాన్ ఖాన్ కి ఫ్యామిలీ సెంటిమెంట్స్ తక్కువేమీ కాదు. తన సోదరులు అన్నా.. సోదరి అర్పితా ఖాన్ అన్నా అతడికి అమితమైన ఇష్టం. ముఖ్యంగా తన తండ్రికి దత్త పుత్రికే అయినా కానీ సోదరి అర్పిత అంటే సల్మాన్ కి ప్రాణం. అందుకే అతడు అర్పిత మెచ్చిన సఖుడు ఆయుష్ శర్మను ఇచ్చి ఘనంగా పెళ్లి జరిపించాడు. హైదరాబాద్ ఫలక్ నుమా ప్యాలెస్ లో అర్పిత-ఆయుష్ జంట వివాహం బాలీవుడ్ టాలీవుడ్ సెలబ్రిటీలు.. సినీరాజకీయ ప్రముఖుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ జంటకు ప్రస్తుతం ఒక పండంటి బిడ్డ కూడా ఉన్నారు.
తన కుటుంబ సభ్యుల్లో కొందరు కోవిడ్ -19 వైరస్ బారిన పడ్డారని అర్పితకు కోవిడ్ సోకిందని ఇటీవల సల్మాన్ ఖాన్ వెల్లడించారు. తన తదుపరి చిత్రం `రాధే` ప్రచార సమావేశంలో సల్మాన్ తన సోదరీమణులు అర్పితా ఖాన్ శర్మ -అల్విరా అగ్నిహోత్రి ఈ వ్యాధి బారిన పడ్డారని చెప్పారు. వారికి ఎలాంటి లక్షణాలు లేవని వెల్లడించారు. మహమ్మారి రెండవ వేవ్ మరింత ప్రమాదకరమని ఆయన అన్నారు.
ఇంతకు ముందు ఎవరికో వైరస్ వచ్చిందని విన్నాం. కానీ ఈసారి మా కుటుంబంలో కోవిడ్ కేసులు వచ్చాయి. చివరికి మా ఇంటి డ్రైవర్లకు కరోనా సోకింది. కానీ ఈసారి అది చాలా మందికి సోకుతోంది! అని భాయ్ తెలిపారు.
గత నెలలో ముంబైలో 5000 మంది ఫ్రంట్ లైన్ కార్మికులకు సల్మాన్ ఆహారం ఏర్పాటు చేశారు. అతడు ఆహార పంపిణీని పర్యవేక్షిస్తున్న వీడియో తన ఆమోద ముద్రను ఇచ్చే ముందు ఆహారాన్ని రుచి చూసే వీడియో ఆన్ లైన్ లో కనిపించింది. మహమ్మారి సమయంలో సహాయం కోసం ముందుకు రావడం గురించి సల్మాన్ మాట్లాడుతూ “ప్రతిరోజూ వందలాది మంది సహాయం కోసం పిలుస్తున్నారు అనేది నిజం. ప్రజలకు సహాయం చేయడానికి మేం మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. మేం 25000 నుండి 50000 సినీకార్మికులకు ఆహారం – మందులను అందిస్తున్నాం“ అని తెలిపారు.
సల్మాన్ నటించిన `రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్` మే 13న విడుదలవుతోంది. ప్రస్తుతం ఆయన రిలీజ్ ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు. ఈద్ కానుకగా ఈ చిత్రం 40 దేశాలలో విడుదల కానుంది. వీటిలో ప్రధానంగా విదేశీ మార్కెట్లలో థియేట్రికల్ రిలీజ్ సంచలనంగా మారింది.