‘బాలీవుడ్ బాద్షా’ ట్యాగ్ లైన్ సొంతం చేసుకున్న షారూక్ ఖాన్.. ఏళ్ల తరబడి బాక్సాఫీస్ ను దున్నేశాడు. తిరుగులేని స్టార్ డమ్ తో నంబర్ వన్ హీరోగా వెలుగొందాడు. అయితే.. కొన్నేళ్లుగా షారూక్ ఎదుర్కొంటున్న వైఫల్యాలు ఫ్యాన్స్ ను నిరాశకు గురిచేయడంతోపాటు.. షారూక్ ను సైతం నైరాశ్యంలోకి నెట్టాయి. షారూక్ నిఖార్సైన హిట్ చూసి ఎన్ని సంవత్సరాలైంది అని అడిగితే.. ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో.. రెండు సంవత్సరాలుగా సినిమా చేయకుండా ఉండిపోయిన షారూక్.. ఇప్పుడు ‘పఠాన్’ తో రాబోతున్నాడు.
ప్రముఖ బ్యానర్ సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని.. ‘వార్’తో బంపర్ హిట్ కొట్టిన సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీలో షారూక్ గూఢచారి పాత్రలో నటిస్తున్నాడు. అయితే.. ఈ చిత్రంలో మరో స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా కనిపించబోతున్నట్టు ప్రచారమైతే సాగుతోంది.
వీరిద్దరూ కలిసి గతంలో పలు మల్టీస్టారర్ సినిమాల్లో నటించారు. ఒకరి సినిమాలో మరొకరు గెస్ట్ రోల్ ప్లే చేసి.. ఫ్యాన్స్ కు అద్దిరిపోయే కిక్కిచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ కలిసి కనిపించబోతున్నారనే వార్త ఇప్పుడు బీటౌన్ లో చక్కర్లు కొడుతోంది.
ఈ సినిమాలో గూఢచారిగా ఉన్న షారూక్.. ఓ ఆపరేషన్ సందర్భంగా చిక్కుల్లో పడతాడని తెలుస్తోంది. రష్యన్ మాఫియా నుంచి వచ్చిపడే ముప్పు నుంచి తప్పించేందుకు.. సల్మాన్ అద్దిరిపోయే ఎంట్రీ ఇచ్చి సేవ్ చేస్తాడని ప్రచారం సాగుతోంది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి విలన్లు తుక్కు రేగ్గొడతారని టాక్. ఆన్ స్క్రీన్ ఖాన్ ద్వయం చేసే ఫైటింగ్ అభిమానులకు ఫుల్ ఫీస్ట్ గా ఉంటుందని చెబుతున్నారు.
ఇదిలాఉంటే.. ఇప్పుడు మరో ఇంట్రస్టింగ్ టాపిక్ ఒకటి చక్కర్లు కొడుతోంది. సల్మాన్ షారూక్ ఇద్దరూ నైబర్స్ కాబోతున్నారట! అంటే.. ఇంటి పక్కన ఉండడం కాదు. సినిమా షూటింగ్ లో పక్క పక్కనే ఉండడం! అవును.. వీరిద్దరి సినిమా సెట్లు పక్కపక్కనే నిర్మిస్తున్నారట.
షారూక్ పఠాన్ చిత్రం చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. లాస్ట్ షెడ్యూల్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఈ నెలాఖరులో దీన్ని మొదలు పెట్టాలని చూస్తున్నారు మేకర్స్. ఇందుకోసం ముంబైలోని మెహబూబ్ స్టూడియలో భారీ సెట్ నిర్మించారట. అయితే.. సల్మాన్ చిత్రానికి సంబంధించిన సెట్ ను కూడా ఇదే స్టూడియోలో నిర్మించారని టాక్. టైగర్ ఫ్రాంచైజీలో రాబోయే తన చిత్రం కోసం సల్మాన్ ఈ సెట్లో అడుగు పెట్టనున్నాడు.
ఈ విధంగా.. రాబోయే రెండు నెలలపాటు సల్మాన్ షారుఖ్ పక్కపక్కనే ఉండి షూటింగ్ చేయబోతున్నారన్నమాట. అంతేకాదు.. వీరిద్దరూ షూటింగ్ కొనసాగినన్ని రోజులు అక్కడే ఉండేందుకు మేకర్స్ వేర్వేరుగా తాత్కాలిక ఇళ్లను కూడా నిర్మించారట. ఈ విధంగా కూడా.. ఈ స్టార్ హీరోలు పక్క పక్కనే ఉండి సినిమా షూటింగులు చేయబోతున్నారు. ఇది ఖచ్చితంగా ఫ్యాన్స్ కు సంతోషకరమైన విషయమే అనడంలో సందేహం లేదు.