సమంత సినిమాను కాదనుకున్న ఈషా.. కారణం ఇదేనా!

తెలుగు బ్యూటీ అయిన ఈషా రెబ్బకు సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ చాలానే ఉంది. చేసింది కొన్ని సినిమాలే అయినా కావాల్సిన అభిమామాన్ని కూడగట్టుకుంది. తనకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు తన సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తూ ఫాన్స్‌ను ఫిదా చేస్తోంది. ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ‘పిట్టకథలు’ చిత్రంలో ఈషా నటించిన విషయం తెలిసిందే. అయితే బందిపోటు, అమీ తుమీ, ఆ, రాగల 24 గంటల్లో వంటి మంచి సినిమాల్లో నటించినా ఈ భామకు ఇంతవరకు సరైన బ్రేక్ రాలేదు. అంతేగాక పెద్ద సినిమాల నుంచి ఆఫర్లు వచ్చిన దాఖలూ లేవు. కానీ ప్రస్తుతం ఓ భారీ సినిమా నుంచి వచ్చిన అవకాశాన్ని ఈషా కాదనుకున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత అక్కినేని తాజాగా నటిస్తున్న చిత్రం శాకుంతలం. గుణశేఖర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం ఈషా రెబ్బాను సంప్రదించినట్లు సమాచారం. అయితే ఇందుకు ఈ చిన్నది నో చెప్పినట్లు తెలుస్తోంది. రెమ్యూనరేషన్‌ కారణంగా సినిమా నుంచి తప్పుకున్నట్లు వినికిడి. ఈషాకు తక్కువ పారితోషికం ఆఫర్‌ చేయడం వల్ల శాకుంతలంలో భాగం కావడం ఇష్టం లేదని చెప్పినట్లు టాక్‌ వినిపిస్తోంది. దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. కాగా గుణ శేఖర్ శాకుంతలం కథ మహాభారతంలోని ఆదిపర్వం నుండి తీసుకోనున్నారు. ఈ సినిమాలో శకుంతల, దుష్యంతుల ప్రేమ కథను చూపించనున్నాడు గుణశేఖర్. పాన్ ఇండియా లెవల్లో రూపోందిస్తున్న ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిచనున్నారు.