ప్రస్తుతం టాలీవుడ్ స్టార్స్ అందరి ఫైనల్ డెస్టినేషన్ బాలీవుడ్ గా మారింది. క్రేజ్ – ఇమేజ్ తో సంబంధం లేకుండా స్టార్ హీరోహీరోయిన్లతో పాటుగా చిన్న హీరోలు కూడా పాన్ ఇండియా మార్కెట్ పై దృష్టి సారిస్తున్నారు. వరుసగా అందరూ మల్టీలాంగ్వేజ్ సినిమాలు చేస్తున్నారు. ప్రభాస్ – ఎన్టీఆర్ – రామ్ చరణ్ – విజయ్ దేవరకొండ – అల్లు అర్జున్ – కళ్యాణ్ రామ్ – సందీప్ కిషన్ – ఆది సాయికుమార్.. ఇలా ప్రతి ఒక్కరూ పాన్ ఇండియా సినిమాలు లైన్ లో పెట్టారు. ప్రభాష్ – నాగ చైతన్య వంటి వారు స్ట్రెయిట్ హిందీ సినిమాలు చేస్తుంటే.. సమంత – రష్మిక వంటి హీరోయిన్లు కూడా ఇప్పుడు బాలీవుడ్ పై ఫుల్ ఫోకస్ పెట్టారు.
ఈ నేపథ్యంలో సినిమాల విషయమై మన స్టార్స్ కి హైదరాబాద్ టూ బాంబే రాకపోకలు బాగా పెరిగిపోయాయి. సినిమా షూటింగ్ లు కూడా ముంబైలోనే ప్లాన్ చేస్తుండటంతో రెగ్యులర్ గా అక్కడికి వెళ్లాల్సి వస్తోంది. వెళ్లిన ప్రతిసారీ హోటల్లో గడపాల్సి వస్తోంది. దీంతో ఇప్పుడు టాలీవుడ్ స్టార్స్ అందరూ బాలీవుడ్ లో గూడు ఏర్పరచుకోవాలని చూస్తున్నారు. ఫ్యూచర్ లో మరిన్ని పాన్ ఇండియా సినిమాలు చేయాలని కోరుకుంటున్న ప్రతీ స్టార్ ముంబైలో ఫ్లాట్స్ తీసుకునే ప్లాన్స్ లో ఉన్నారని తెలుస్తోంది.
ఇటీవలే బాలీవుడ్ లో అడుగుపెట్టిన లక్కీ బ్యూటీ రష్మిక మందన్న.. ఇప్పటికే ముంబైలో ఒక ఖరీదైన ఫ్లాట్ తీసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రెండు బాలీవుడ్ ప్రాజెక్టులలో నటిస్తున్న ఈ బ్యూటీ.. అక్కడే పాగా వేయాలని చూస్తోంది. ఈ క్రమంలో ఆమెకు ఓ ఇల్లు అవసరమైంది. ఇదే క్రమంలో రామ్ చరణ్ ముంబైలో ఓ బంగ్లా కొన్నారనే వార్తలు గత కొన్ని రోజులుగా నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ముంబైలోని ఖార్ ప్రాంతంలో విలాసవంతమైన బీచ్ సైడ్ ఇంటిని రామ్ చరణ్ – ఉపాసన దంపతులు కొనుగోలు చేశారని సమాచారం.
చెర్రీ – ఉప్సీ కలిసి రీసెంటుగా గృహ ప్రవేశం కూడా చేసినట్లు బీ టౌన్ వర్గాలు చెబుతున్నాయి. ఉన్నట్టుండి మెగా వారసుడు బాంబేలో ఇల్లు కొనడానికి ప్రత్యేకమైన కారణం ఉందని అంటున్నారు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో చరణ్ నటిస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రాన్ని బాలీవుడ్ లో భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత శంకర్ డైరెక్షన్ లో చేయబోయేది కూడా పాన్ ఇండియా మూవీనే. RRR సినిమాతో నేషనల్ వైడ్ వచ్చే క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని చరణ్ ప్లాన్స్ చేసుకుంటున్నట్లు అర్థం అవుతోంది. అందుకే ముంబైలో ఇల్లు కొన్నాడని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే దీనిపై మెగా ఫ్యామిలీ ఇంతవరకు స్పందించ లేదు.
చరణ్ – ఉపాసన దంపతుల బాటలోనే అక్కినేని నాగచైతన్య – సమంత దంపతులు కూడా అడుగులు వేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. త్వరలోనే ఈ స్టార్ కపుల్ కూడా ముంబైలో ఓ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ‘ది ఫ్యామిలీ మ్యాన్-2’ వెబ్ సిరీస్ తో సామ్ నేషనల్ వైడ్ పాపులర్ అయింది. ఈ క్రమంలో బాలీవుడ్ లో వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే ‘శాకుంతలం’ అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తోంది. ‘సాకీ’ పేరుతో ఫ్యాషన్ రంగంలోకి అడుగుపెట్టిన సామ్.. సినిమాలతో పాటుగా బిజినెస్ ని కూడా విస్తరించే ఆలోచనతో బాంబే కి మకాం మార్చాలని చూస్తోందట.
మరోవైపు నాగచైతన్య సైతం ఇప్పుడు బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. అమీర్ ఖాన్ హీరోగా నటిస్తున్న ‘లాల్ సింగ్ చద్దా’ చిత్రంలో చైతూ కీలక పాత్రలో కనిపించనున్నాడు. అలానే పలు యాడ్ షూట్స్ కోసం చై హైదరాబాద్ – ముంబై ల మధ్య ప్రయాణం చేస్తున్నారు. ఇలా చై-సామ్ జంట ఓ వైపు సినిమా షూటింగులు.. మరోవైపు బిజినెస్ – బ్రాండ్ ఎండార్స్మెంట్స్ కోసం ముంబయిలో ఓ బంగ్లా కొనాలని చూస్తున్నారట. ఇప్పటికే ఆ దిశగా ప్రయత్నాల కూడా మొదలు పెట్టారని సమాచారం.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నాలుగు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లైన్ లో పెట్టారు. ఇప్పటికే ‘ఆదిపురుష్’ ‘సలార్’ సినిమాల చిత్రీకరణ కోసం ఎక్కువ రోజులు ముంబైలోనే ఉండాల్సి వస్తోంది. ఫ్యూచర్ లో ప్రభాస్ చేసే ప్రతి ప్రాజెక్ట్ కూడా బాలీవుడ్ ని దృష్టిలో పెట్టుకునే చేస్తాడు. ప్రస్తుతం ముంబై వెళ్ళినప్పుడు హోటళ్లలో బస చేస్తున్న ప్రభాస్.. ఇప్పుడు అక్కడ కూడా ఒక విలాసవంతమైన ఇల్లు కొనుగోలు చేయాలనే ఆలోచన చేస్తున్నారట.
‘లైగర్’ సినిమా కోసం బాలీవుడ్ లోనే ఉంటున్న విజయ్ దేవరకొండ కూడా మకాం మార్చే అవకాశం ఉందని అంటున్నారు. ఎన్టీఆర్ – అల్లు అర్జున్ కూడా ఇకపై పాన్ ఇండియా ప్రణాళికలు రెడీ చేసుకుంటున్నారు కాబట్టి సినిమా షూటింగ్ లు ఇతరత్రా కారణాల దృష్ట్యా ముంబైలో ఫ్లాట్స్ తీసుకున్నా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. మరి రాబోయే రోజుల్లో ఎంతమంది టాలీవుడ్ స్టార్స్ బాలీవుడ్ కు మకాం మారుస్తారో చూడాలి.