బాధ పెట్టాలనుకోలేదు.. క్షమించండి: సమంత

గోల్డెన్ లెగ్ ఆఫ్ టాలీవుడ్.. ‘సమంత’కు ఫ్లాప్స్ తక్కువ.. హిట్స్ ఎక్కువ. సక్సెస్ రేట్ కి మించి అత్యుత్తమ ప్రతిభ ఉన్న నటిగా ఆమెకు మరింత పేరు ఉంది. ఇటీవల ‘ఫ్యామిలీ మ్యాన్‌ 2’ వెబ్ సిరీస్ లో నటించినందుకు ఉత్తమ నటిగా ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ మెల్‌బోర్న్‌- 2021 అవార్డు గెలుచుకుంది. దీనిపై ఓ ఇంగ్లీష్ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ఈ వెబ్ సిరీస్ లో నటించినందుకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పింది.

నిజానికి ఈ వెబ్ సిరీస్ విడుదలకు ముందు వచ్చిన వివాదం.. విడుదలయ్యాక రెండు, మూడు రోజుల్లోనే సమసిపోయిందని చెప్పింది. ఇప్పటికీ ఆ పాత్రపై తనను విమర్శించేవారున్నారని.. అయినా ‘రాజీ’ పాత్ర తనకెంతో ఇష్టమని.. ఇష్టపడి నటించానని చెప్పింది. ఎవరినీ బాధ పెట్టాలనే ఉద్దేశం తనకు లేదని.. ఒకవేళ తనవల్ల ఎవరైనా బాధ పడుంటే క్షమించాలని చెప్పింది. రాజీ అనే డీగ్లామర్ పాత్రలో సమంత నటన అద్భుతమనే చెప్పాలి. విమర్శకులు సైతం ఆమె నటనను మెచ్చుకున్నారు.

ప్రస్తుతం సమంత తెలుగులో ‘శాకుంతలం’, తమిళ్ లో ‘కాతువాకుల రెండు కాదల్‌’ సినిమాల్లో నటిస్తోంది. ఒకటి తన చిరకాల కోరిక అయిన పిరియాడికల్ పాత్ర అయితే.. రెండోది తానెంతో ఇష్టపడే కామెడీ పాత్ర అని.. రెండు సినిమాలు తనకెంతో పేరు తెస్తాయని అంటోంది.