సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ పెట్లా దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ”సర్కారు వారి పాట”. ఎస్ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. చెప్పిన సమయానికి సర్కారు వారు వస్తారా లేదా అనేది పక్కన పెడితే.. ఈ సినిమా పనులు మాత్రం శరవేగంగానే జరుగుతున్నాయి.
‘సర్కారు వారి పాట’ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ – బ్లాస్టర్ టీజర్ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో త్వరలో ఫస్ట్ సింగిల్ లిరికల్ వీడియో వస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సోషల్ మీడియా ద్వారా బాలీవుడ్ సింగర్ ఆర్మన్ మాలిక్ ఆలపించిన ఓ పాట రికార్డింగ్ పూర్తైన విషయాన్ని వెల్లడించారు.
నిన్న రాత్రి ఒక అందమైన తెలుగు పాటను రికార్డ్ చేసారని.. ఎప్పటిలాగే సూపర్ టాలెంటెడ్ శ్రీకృష్ణ సాంగ్ కంపోజిషన్ లో సహాయం చేసారని సింగర్ అర్మాన్ మాలిక్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా థమన్ ని మిస్ అవుతున్నట్లు పేర్కొన్నారు. దీనికి తమన్ స్పందిస్తూ.. చెన్నైలో లైవ్ వర్క్స్ లో చిక్కుకుపోవడం వల్ల నిన్ను కలవడం మిస్సయ్యాను బ్రదర్ అని అన్నారు. మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారి కోసం పాడాలనే నీ కల ‘సర్కారు వారి పాట’ తో నెరవేరింది. ఈ పాటను ప్రజల హృదయాల్లోకి తీసుకెళ్లడానికి వేచి ఉండలేకపోతున్నాను అని థమన్ పేర్కొన్నారు. మరి త్వరలోనే ఈ బ్యూటిఫుల్ సాంగ్ ని రిలీజ్ చేస్తారేమో చూడాలి.
మహేష్ బాబు – థమన్ కాంబోలో వస్తున్న నాలుగో ఆల్బమ్ ‘సర్కారు వారి పాట’. గతంలో మహేశ్ కు ‘దూకుడు’ ‘బిజినెస్ మ్యాన్’ ‘ఆగడు’ వంటి చార్ట్ బస్టర్ ఆల్బమ్స్ అందించారు. ఈ క్రమంలో దాదాపు ఆరేళ్ల గ్యాప్ తర్వాత తమన్ సంగీత సారథ్యంలో వస్తున్న సర్కారు వారి పాటల పై సూపర్ స్టార్ ఫ్యాన్స్ మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే మోషన్ పోస్టర్ – టీజర్ కు అందించిన బీజీఎమ్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. పాటలు ఎలా ఉంటాయో చూడాలి.
కాగా ‘సర్కారు వారి పాట’ చిత్రంలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. సముద్ర ఖని – ప్రకాష్ రాజ్ – వెన్నెల కిషోర్ – సుబ్బరాజు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ – 14 రీల్స్ ప్లస్ – మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. నవీన్ యెర్నేని – వై.రవిశంకర్ – రామ్ ఆచంట – గోపీచంద్ ఆచంట నిర్మాతలు. ఆర్. మది ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు.