గన్ను గురిపెట్టిన ధనుష్ అన్న.. తమ్ముడికి పోటీ వచ్చేలా ఉన్నాడే..!


‘7/G బృందావన కాలనీ’ ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ ‘యుగానికొక్కడు’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన తమిళ దర్శకుడు సెల్వరాఘవన్. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కు స్వయానా సోదరుడైన సెల్వ.. ప్రస్తుతం ‘యుగానికొక్కడు 2’ చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉన్నారు. తమిళంలో స్టార్ డైరెక్టర్స్ లో ఒకరిగా కొనసాగుతున్న సెల్వ రాఘవన్.. ఇప్పుడు నటుడిగా మారాడు. మహానటి కీర్తి సురేష్ తో కలసి ”సాని కాయిదమ్” అనే చిత్రంలో నటిస్తున్నారు.

‘సాని కాయిదమ్’ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ మంచి స్పందన తెచ్చుకుంది. ఇందులో కీర్తి సురేశ్ – సెల్వరాఘవన్ ఇద్దరూ డీ గ్లామరైజ్డ్ లుక్ లో చేతిలో కత్తులు – తుపాకులు పట్టుకొని అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఈ క్రమంలో తాజాగా సెల్వరాఘవన్ మరో ఇంటెన్స్ పోస్టర్ ని సోషల్ మీడియాలో వదిలారు. ఇందులో దర్శకుడు రక్తపు చేతులతో ఎవరికో గన్ గురిపెట్టి సీరియస్ గా చూస్తున్నాడు. మాసిన గడ్డం.. పెద్ద కళ్ళద్దాలతో కనిపిస్తున్న సెల్వ లుక్ అందరిలో ఆసక్తిని కలిగింది.

దర్శకుడిగా సత్తా చాటిన క్రియేటివ్ డైరెక్టర్ సెల్వ రాఘవన్.. ఇప్పుడు నటుడిగా కూడా తనదైన ముద్ర వేయబోతున్నాడని ఈ పోస్టర్ చూస్తే అర్థం అవుతోంది. తమ్ముడు ధనుష్ నటించిన ‘అసురన్’ ‘కర్ణన్’ స్థాయిలో అన్న పెర్ఫార్మన్స్ ఇస్తాడేమో చూడాలి. ‘సాని కాయిదమ్’ చిత్రానికి అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు. స్క్రీన్ సీన్ మీడియా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందుతోంది.