షాదీ ముబారక్‌: ‘మొగిలిరేకులు’ సాగర్‌ హీరోగా సినిమా

బుల్లితెరలో నటించి మహిళల ఆదరాభిమానం పొందిన నటుడు సాగర్‌ ఆర్కే నాయుడు ఇప్పుడు వెండితెరపై హీరోగా పరిచయం అవుతున్నాడు. సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా నటించిన సాగర్‌ తొలిసారిగా హీరోగా నటిస్తున్నాడు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో దిల్‌ రాజు నిర్మిస్తుండగా సాగర్‌ హీరోగా ‘షాదీ ముబారక్‌’ సినిమా తెరకెక్కుతోంది. దీనికి సంబంధించిన ట్రైలర్‌ విడుదలైంది. ఈ సినిమా ట్రైలర్‌ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది.

‘మొగిలిరేకులు, చక్రవాకం’ సీరియల్స్‌తో పేరు పొందిన సాగర్‌ నటించిన ‘షాదీ ముబారక్‌’ ట్రైలర్‌ను గురువారం నిర్మాత దిల్‌ రాజు విడుదల చేశాడు. ‘సిద్ధం కండి.. ప్రేమ రైడ్‌కు హార్దిక స్వాగతం పలికేందుకు’ అని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ ట్వీట్‌ చేసింది. కొత్త దర్శకుడు పద్మశ్రీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. పెళ్లి చూపుల నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్‌ ఉంది. సాగర్‌కు జోడీగా దృశ్య రఘునాథ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఎన్నారై పాత్రలో సాగర్‌ నటిస్తున్నాడు. ఒకే రోజు మూడు పెళ్లి సంబంధాలు చూసేందుకు వెళ్లి సాగర్‌ ఎలాంటి ఇబ్బందులు పడ్డాడో సినిమా కథ ఉన్నట్టు తెలుస్తోంది. అందంగా.. ఆహ్లాదకరంగా ట్రైలర్‌ రూపొందించారు. ఈ సినిమాను మార్చి 5వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.