హృదయాన్ని హత్తుకునేలా ప్రేమ కథా చిత్రాలు తీయడంలో యువ దర్శకుడు శివ నిర్వాణ తన మార్క్ చూపిస్తున్నాడు. ‘నిన్నుకోరి’ సినిమాతో అరంగేట్రం చేసిన ఈ దర్శకుడు తొలి చిత్రంతోనే ప్రేక్షకుల మనసుకు హత్తుకునేలా సినిమా తీశాడు. చాలా మంది దర్శకుల్లా రెండో సినిమా ఫెయిల్యూర్ ఇతడిని వెంటాడలేదు. రెండో చిత్రం ‘మజిలీ’తోనూ శివ నిర్వాణ హిట్ కొట్టాడు. ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమాతో రెడీ అయిపోయాడు.
నాని హీరోగా ‘టక్ జగదీష్’ చిత్రాన్ని శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందించారు. ఈ చిత్రం ఈనెల 10న వినాయకచవితి సందర్భంగా అమెజాన్ ప్రైమ్ లో విడుదలవుతోంది. దీని తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా సినిమా చేయాల్సి ఉంది.
అయితే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ప్యాన్ ఇండియా స్థాయిలో ‘లైగర్’ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాతో బాలీవుడ్ లోకి విజయ్ ఎంట్రీ ఇస్తున్నాడట.. ఈ క్రమంలోనే మొత్తం ప్యాన్ ఇండియా మూవీలే చేయాలని.. కథలు కూడా యూనివర్స్ థీమ్ ఉన్నవే చేయాలని విజయ్ డిసైడ్ అయ్యాడట.. ఈ క్రమంలోనే శివ నిర్వాణతో చిత్రం ఆగిపోయినట్లు వార్తలొచ్చాయి. శివ చెప్పిన కథకు మార్పులు చేయమని అడిగితే చేయలేదని.. దీంతో సినిమా పట్టాలెక్కే అవకాశాలు లేవని రూమర్లు వినిపిస్తున్నాయి.
ఇటు విజయ్ అటు శివ నుంచి కూడా ఈ సినిమా గురించి సంకేతాలు లేకపోవడంతో ఈ రూమర్లు నిజమే అనుకున్నారు. కానీ ఇప్పుడు శివ ఈ సినిమాపై పెదవి విప్పాడు. విజయ్ తో తన సినిమా తప్పకుండా ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు.
టక్ జగదీష్ ప్రమోషన్లలో భాగంగా మీడియాను కలిసిన అతను.. విజయ్ తో తన దర్శకత్వంలో సినిమా త్వరలోనే మొదలవుతుందన్నాడు. ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నట్టు శివ క్లారిటీ ఇచ్చాడు.
లైగర్ మూవీ తర్వాత విజయ్ దేవరకొండతో శివ సినిమా ఉండొచ్చని సమాచారం. థమన్ తో గొడవలపై కూడా శివ స్పందించాడు. పాటలు బ్యాక్ గ్రౌండ్ అనుకునే ఇద్దరితో చేయించామని.. ‘మజిలీ’కి గోపీ పాటలు ఇస్తే థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేశాడని శివ క్లారిటీ ఇచ్చాడు. ఈ ఫ్యామిలీ డ్రామాకు గోపీ సుందర్ ఆర్ఆర్ బాగుంటుందని అతడితో చేయించామని చెప్పుకొచ్చాడు.