హీరో సిద్దార్ధ్ చాలా రొమాంటిక్ కోణంలో, బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డిని ఉద్దేశించి ట్వీటేశాడు. ఇటీవల బీజేపీ కార్యకర్తలు, నేతలు కొందరు సిద్దార్ధపై విమర్శలు చేయడమే కాదు, చంపేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్న విషయం విదితమే.
వర్తమాన రాజకీయాలపై స్పందించడమే సిద్దార్ధ చేసిన నేరం. ఈ క్రమంలో సిద్దార్ధ ఫోన్ నెంబర్ సోషల్ మీడియాలోకి వచ్చేసింది. ఆ ఫోన్ నెంబర్ పట్టుకుని, అతనికి ఫోన్ చేస్తూ బెదిరింపులకు దిగుతున్నారు.. సిద్దార్ధతోపాటు అతని కుటుంబ సభ్యుల్ని చంపేస్తామని బెదిరిస్తున్నారట బీజేపీ నేతలు. కాగా, ఈ ఎపిసోడ్ ఇటీవల మరింత రసవత్తరంగా మారింది.
బీజేపీ ఏపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి, సిద్దార్ధను ఉద్దేశించి, నీ సినిమాలకి మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం ఫండింగ్ చేస్తున్నాడా.? అని ప్రశ్నించారు ట్విట్టర్ ద్వారా. అధికారంలో వున్నది బీజేపీ. అలాంటి డౌట్లు ఏమన్నా వుంటే, విచారణ జరిపి సిద్దార్ధ మీద చర్యలు తీసుకోవాలి గానీ, ఇలా అనుమానాలు వ్యక్తం చేయడమేంటి.? బీజేపీ ఎప్పటికి ఎదుగుతుందో ఏమో.. అన్న చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. మరోపక్క, తనపై విష్ణువర్ధన్ వేసిన సెటైర్ మీద సిద్దార్ధ స్పందించాడు.
‘లేదు రా..’ అంటూ తనదైన స్టయిల్లో చాలా రొమాంటిక్ కోణంలో సెటైర్ వేశాడు సిద్దార్ధ. ‘అతను (దావూద్ ఇబ్రహీం) నా టీడీఎస్ చెల్లించడంలేదు. నేను నిఖార్సయిన పౌరుడ్ని. నేను పన్ను చెల్లింపుదారుడ్ని కదరా విష్ణు. వెళ్ళి పడుకో. బీజేపీ స్టేట్ సెక్రెటరీ అంట.. సిగ్గుండాలి..’ అంటూ సిద్దార్ధ ట్వీటేశాడు.
దేశంలో బీజేపీ నేతల రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోయాయో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.? రాజకీయ విమర్శలు చేయాల్సి వస్తే, మాఫియా డాన్లతో లింకులు పెట్టడం, పాకిస్తాన్ పేరు ప్రస్తావనకు తీసుకురావడం అలవాటైపోయింది కమలదళానికి. బీజేపీని ఎవరు విమర్శించినా, వాళ్ళకి పాకిస్తాన్ లేదా మాఫియాతో లింకులు పెట్టడంలో ఏం నైతికత వుందో బీజేపీ పెద్దలకే తెలియాలి. తమ స్థాయిని దిగజార్చుకోవడంలో అత్యంత లోతుని చూసేస్తున్నారు బీజేపీ నేతలు.